తొలిసారి లాభాల్లోకి పేటీఎం.. రూ.122 కోట్ల ప్రాఫిట్.. దూసుకెళ్లిన షేరు

Wait 5 sec.

: ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం కష్టాల నుంచి గట్టెక్కింది. విజయ్ శేఖర్ శర్మ నేతృత్వంలోని వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌ కంపెనీ తొలిసారి లాభాలు ప్రకటించింది. గత కొన్నేళ్లుగా నష్టాల్లో మునిగిపోయిన ఈ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం 2025- 26 తొలి త్రైమాసికం ఫలితాల్లో రాణించింది. మంగళవారం మార్కెట్లు ముగిసిన తర్వాత ఏప్రిల్- జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. దీంతో పేటీఎంకు మంచి రోజులు వచ్చాయని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ ఏకంగా రూ. 838.9 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. అంతకు ముందు త్రైమాసికంలో రూ. 539.8 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. వరుస త్రైమాసికాల్లో నష్టాలు తప్పా లాభాలు చూడని పేటీఎం చాలా కాలం తర్వాత లాభాలు ప్రకటించడం గమనార్హం. సమీక్షా త్రైమాసికంలో పేటీఎం ఆదాయం సైతం 27 శాతం మేర వృద్ధి నమోదు చేసినట్లు తెలిపింది. గత ఏడాది 2024-25 తొలి త్రైమాసికంలో రూ. 1501.6 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రూ. 1917.5 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో పేటీఎంకు 8 లక్షల కొత్త సబ్ స్క్రైబర్లు చేరినట్లు తెలిపింది. దీంతో మొత్తం సబ్‌స్క్రైబర్ల బేస్ 1.24 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆదాయం రూ. 545 కోట్లకు పెరిగినట్లు పేటీఎం తెలిపింది. దూసుకెళ్లిన పేటీఎం షేరుతొలి త్రైమాసిక ఫలితాలు ప్రకటిస్తారనే నేపథ్యంలో పేటీఎం షేరు ఈరోజు రాణించింది. ఈసారి మంచి ఫలితాలు ప్రకటించవచ్చన్న అంచనాలతో ఈ షేరును కొనుగోలు చేసేందుకు మదుపరులు మొగ్గు చూపారు. దీంతో 3.5 శాతానికి పైగా పెరిగింది. స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి 3.48 శాతం లాభంతో రూ. 1053 వద్ద ముగిసింది. ఈ షేరు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి రూ. 1062.95 వద్ద ఉంది. అంటే గరిష్ఠ స్థాయి సమీపంలోకి రూ. 1060 వద్దకు వెళ్లి కాస్త వెనక్కి తగ్గింది. త్వరలోనే సరికొత్త గరిష్ఠ స్థాయిని నమోదు చేయవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 67150 కోట్లుగా ఉంది.