ఇంటి పెత్తనం శ్రీవల్లికి ఇచ్చేసినా... అదో పెద్ద డ్రామా కంపెనీ ఆర్టిస్ట్ మామయ్యా అని నిజాన్ని బయటపెట్టలేదు ప్రేమ, నర్మదలు. దీంతో శ్రీవల్లి వాళ్లతో చెడుగుడు ఆడుకుంటుంది. బాధపడటం మాత్రమే శ్రీవల్లి, ప్రేమల వంతౌతుంది. ఏంటక్కా ఇదీ.. మామయ్య గారు పోయి పోయి ఇంటి పెత్తనం ఆ వల్లీ చేతిలో పెట్టారు.. దొంగ చేతికి తాళాలు ఇచ్చారేంటి? అని నర్మదతో అంటుంది ప్రేమ. మామయ్య దృష్టిలో ఆ వల్లీ అంటే.. ఇంటిని వెలిగించే కోడలు. కానీ ఇంటిని తగులబెట్టే లక్షణాలు టన్నులు టన్నులు ఉన్నాయి. అవి మామయ్యకి తెలియదు. పైగా మామయ్యకి జరిగిన అవమానాన్ని చూసి తట్టుకోలేకపోతున్నానంటూ చాలా ఓవరాక్షన్ చేస్తుంది. ఇంటికి వెళ్లిపోతానంటూ డ్రామాలాడింది. ఆ డ్రామాని నిజమని నమ్మేసిన మామయ్య.. ఆవిడ గారు మాత్రమే ఇంటి గురించి శ్రద్దగా ఆలోచిస్తుందని.. ఆవిడ మాత్రమే ఇంటిని తీర్చదిద్దగలదని మామయ్య గారు ఆవిడగారికి పెత్తనం ఇచ్చారు’ అని అంటుంది నర్మద. ‘ఏమోనక్కా.. దాన్ని చూస్తుంటే ఒళ్లు మండిపోతుంది. అవునూ ఆ రోజు వల్లీ ఇల్లు ఎక్కడుందో కనిపెట్టి.. వాళ్ల బండారం బయటపెట్టకుండా ఎందుకు ఆగిపోయావ్ అక్కా.. అని అంటుంది ప్రేమ. ఆ మాటతో నర్మద.. ‘‘ఏమన్నావ్.. నేను ఆగిపోయానా? గుద్దానంటే ముక్కు పగిలిపోతుంది. ఆరోజు వాళ్ల ఇంటికి వెళ్తుంటే.. నువ్వే కదా అర్జెంట్ పని ఉంది.. సాయంత్రం ఇద్దరం కలిసి వెళ్దాం’ అని చెప్పావ్ అని అంటుంది. నువ్వు అలా వెళ్లిపోవడం వల్ల వాళ్ల ఇల్లు కనిపెట్టకపోవడం ఒక్కటే కాదు.. ఇంట్లో రణరంగం అయ్యింది. ఆ బల్లీ చేతికి ఇంటి పెత్తనం వచ్చింది’ అని అంటుంది నర్మద. ‘అవును అక్కా.. సారీ.. ఇప్పుడు వెళ్లి వాళ్ల సంగతి చూద్దాం పదక్కా’ అని అంటుంది ప్రేమ. దాంతో నర్మద.. ‘మనం చాలా రాంగ్ టైమ్‌లో ఉన్నాం. మామయ్య మనపై కోపంతో ఉన్నారు. అత్తయ్య గారు మనతో మాట్లాడటం లేదు.. మనకి అత్తయ్య సపోర్ట్ వచ్చేవరకూ ఆగుదాం’ అని అంటుంది. సరేనని అంటుంది ప్రేమ. ఇంతలో ధీరజ్ అటుగా రావడం చూస్తారు ప్రేమ, నర్మదలు. ధీరజ్ అని ప్రేమ పిలుస్తుంది కానీ.. పట్టించుకోకుండా వెళ్లిపోతాడు ధీరజ్. దాంతో నర్మద.. ‘ధీరజ్ నీతో మాట్లాడటం లేదా? అని అంటుంది. ‘అబ్బే అదేం లేదక్కా.. నాతో ఇంతకు ముంందులాగే ఉంటున్నాడు.. గొడవేం లేదు.. నేను పిలిచింది వినిపించడం లేదేమో’ అని కవర్ చేసేస్తుంది ప్రేమ. సరే మరి సాగర్ బావ నీతో మాట్లాడుతున్నారా? నీపై కోపం ఏం లేదు కదా’ అని ప్రేమ అడిగితే.. ‘అబ్బే కోపం ఏం లేదు.. నాపై మా ఓడికి చాలా ప్రేమ.. మాట్లాడకుండా ఉండలేడు’ అని అంటుంది నర్మద. ఇంతలో సాగర్ అటుగా వస్తాడు. నర్మదని చూసినా కూడా పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. నర్మద పలకరించినా కూడా పట్టించుకోడు. మొహం వాడి బాబు రామరాజుమల్లే డ్యాష్‌లా పెట్టుకుని అక్కడ నుంచి వెళ్లిపోతాడు. దీంతో ప్రేమకి విషయం అర్థం అయిపోతుంది. నా వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి కదా అక్కా అని ఎమోషనల్ అవుతుంది. ఈ అక్కా చెల్లెల్ల ముచ్చట ఇలా ఉంటే.. అక్కడ వీళ్లకి రంకుమొగుడిలా దాపరించింది శ్రీవల్లి. ఇంటి పెత్తనం చేతికి రావడంతో.. పడుకున్న వాళ్లపై నీళ్లు కొట్టి మరీ చెడుగుడు ఆడుకుంటుంది.