తరగతి గదిలో వెనుక బెంచీలో కూర్చునే విద్యార్థులపై అనాదిగా ఒక రకమైన అభిప్రాయం ఉంది. బ్యాక్‌ బెంచీ వారు అల్లరి పిల్లలని, పాఠాలు సరిగా వినరనే అభిప్రాయాలు సమాజంలో పాతుకుపోయాయి. టీచర్లు కూడా ముందు వరుసల్లోని పిల్లలను దృష్టిలో పెట్టుకొని పాఠాలు చెబుతారనే అభిప్రాయం తల్లిదండ్రుల్లో ఉంది. దీనికి తగినట్టే.. మొదటి 4 వరసల్లో కూర్చునే విద్యార్థులే పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తుంటారు. ఈ పరిణామాలు బ్యాక్ బెంచీ విద్యార్థుల్లో ఆత్మన్యూనతా భావానికి కారణం అవుతున్నాయి. చదువు పూర్తైన తర్వాత కూడా వారిలో ఆ భావన కొనసాగుతోంది. అలాగని, తరగతిలో బ్యాక్ బెంచీలు లేకుండా చేయగలమా..? ఎన్నో ఏళ్లుగా ప్రశ్నగా మిగిలిపోయిన ఈ అంశానికి ఓ సినిమా మార్గం చూపింది. మలయాళ సినిమాలో ప్రస్తావించిన U ఆకారం సీటింగ్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.పసిమొగ్గల్లో కుల, మత, పేద, ధనిక, వర్గ భేదాలు మొగ్గ తొడగకూడదనే లక్ష్యంతోనే స్కూళ్లలో యూనిఫామ్‌లు ప్రవేశపెట్టారు. అయితే, విద్యార్థులను బెంచీలపై వరుసగా కూర్చొబెడితే, వెనుక బెంచీల్లోని పిల్లలు నష్టపోతున్నారనే అంశంపై అధికారులు గానీ, ప్రభుత్వాలు గానీ ఇప్పటివరకు దృష్టి సారించలేదు. దీంతో చివరి బెంచీ విద్యార్థులు అత్తెసరు మార్కులతో గట్టెక్కుతున్నారు. ముందు బెంచీ విద్యార్థులతో పోల్చితే చాలా వెనుకబడిపోతున్నారు. ఈ ‘బ్యాక్ బెంచ్‌’ సమస్యకు ‘స్థానార్థి శ్రీకుట్టన్‌’ అనే మలయాళీ సినిమా ఒక పరిష్కారం చూపింది.మలయాళ సినిమాలో ఏం చెప్పారు?స్థానార్థి శ్రీకుట్టన్‌ (Sthanarthi Sreekuttan) సినిమా 2024 నవంబరు 22న విడుదలైంది. బ్యాక్ బెంచీలో కూర్చునే విద్యార్థి చదువులో వెనుకబడితే ఆ విద్యార్థిదే తప్పు అన్నట్లుగా చూస్తున్నారని.. ఏళ్లుగా ఈ ధోరణి కొనసాగుతోందనే దర్శకుడి ఆవేదన ఈ సినిమాలో కనిపిస్తుంది. తరగతి గదిలో విద్యార్థుల మధ్య అసమానతలను తొలగించేందుకు ‘యూ’ ఆకారపు సీటింగ్‌ ఏర్పాటు చేస్తారు. అప్పటివరకూ బ్యాక్‌ బెంచ్‌‌లో కూర్చునే విద్యార్థి.. ఆ తర్వాత తన తెలివితేటలు, చురుకుదనంతో ఎలా హీరోగా నిలిచాడనేది సినిమా కథ. క్లాస్‌రూమ్‌లో విద్యార్థుల మధ్య ఎలాంటి వివక్ష ఉండొద్దనే సందేశాన్నీ ఈ సినిమా ఇస్తుంది. కుటుంబాల ఆర్థిక స్థితిగతులు, విద్యార్థుల తెలివితేటలు, ప్రవర్తన ఆధారంగా కొందరిని ముందు బెంచీల్లో, మరికొందరిని వెనుక బెంచీల్లో కూర్చోబెట్టకూడదని ఈ సినిమా ద్వారా దర్శకుడు వినేష్ విశ్వనాథ్ (Vinesh Viswanath) చెప్పారు.ఈ సినిమా విడుదలైన తర్వాత ఒడిశా, తమిళనాడు, పంజాబ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా U సీటింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే, తమిళనాడులో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు షణ్ముగప్రియ కొన్నేళ్ల కిందటి నుంచే ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. అయితే, ఈ విధానంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి.హైదరాబాద్ స్కూళ్లలో U షేప్ సీటింగ్: కలెక్టర్ హరిచందన ఆదేశంస్థానార్థి శ్రీకుట్టన్‌ సినిమాను ప్రేరణగా తీసుకొని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ దాసరి హరిచందన.. పాఠశాలల్లో ‘U’ షేప్ సీటింగ్ ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ, రెసిడెన్షియల్‌, ఆశ్రమ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 10వ తరగతి దాకా అన్ని క్లాసుల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. సికింద్రాబాద్‌ పరిధిలోని బోయిన్‌పల్లిలో గిరిజన ఆశ్రమ పాఠశాలను అకస్మాత్తుగా సందర్శించిన కలెక్టర్‌ హరిచందన.. అక్కడ క్లాస్ రూమ్‌లో బెంచీలను చూసి వెంటనే యూ ఆకారంలోకి మార్పించారు. పాఠశాలల్లో బ్యాక్‌ బెంచ్‌ అన్నదే లేకుండా చూడాలని సూచించారు. ‘యూ’ సీటింగ్‌ ఏర్పాటుతో ప్రయోజనాలు ఏంటి?ఈ విధానంలో తరగతి గదిలో బ్లాక్‌ బోర్డు ఉన్న వైపు మినహా మిగతా 3 వైపులా గోడలకు దగ్గరగా బెంచీలు ఏర్పాటు చేస్తారు. అప్పుడు:విద్యార్థులందరిపైనా ఉపాధ్యాయుడు దృష్టి కేంద్రీకరించగలుగుతారు. ప్రతి విద్యార్థి.. ఉపాధ్యాయుడిని, బ్లాక్‌ బోర్డును, ఇతర క్లాస్‌మేట్స్‌ను చూడగలడు.ఈ విధానం ద్వారా పిల్లల్లో ఆసక్తి పెరిగి, అభ్యసన సామర్థ్యం పెరుగుతుంది. పిల్లల్లో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.ముందు-వెనుక బెంచీల పిల్లల మధ్య అసమానతలు తొలగిపోతాయి. పాఠ్యాంశాలపై చర్చలకు ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతి విద్యార్థి.. ఉపాధ్యాయుడితో, తోటి విద్యార్థులతో చర్చించగలడు.మాట్లాడటానికి సంకోచించే విద్యార్థులకు ఈ సీటింగ్ అమరికతో చర్చలలో పాల్గొనడానికి ఎక్కువ వీలు కలుగుతుంది.యూ - ఆకారం సీటింగ్‌లో ఇబ్బందులువిద్యార్థులను U-ఆకారంలో కూర్చోబెట్టినప్పుడు, అందరు విద్యార్థులూ బ్లాక్‌బోర్డ్‌ను సూటిగా చూడలేరు. చివరల్లో కూర్చునే విద్యార్థులు బోర్డు చూడటానికి వారి మెడను తిప్పాల్సి ఉంటుంది. ఎక్కువ సమయం అలా ఓ పక్కగా చూస్తే, మెడ నొప్పి వచ్చే ముప్పు ఉంది.తరగతి గదిలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే, యూ-ఆకారపు పద్ధతిలో కూర్చోబెట్టడం సాధ్యంకాదు. క్లాస్‌రూమ్‌లో విద్యార్థుల సంఖ్య 25 కంటే తక్కువగా ఉంటే, ఈ విధానం నప్పుతుంది.ఇరుకైన తరగతి గదుల్లో ఈ విధానం ఆచరణ సాధ్యంకాదు. గదులు కనీసం 20 అడుగుల వెడల్పు, 20 అడుగుల పొడవు ఉండాలి. మరేం చేయాలి?యూ షేప్ సీటింగ్ అనేది విద్యార్థుల్లో కొంత మార్పును తీసుకొస్తుంది గానీ.. రోజంతా అదే పద్ధతిలో పిల్లలను కూర్చోబెట్టలేమని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. ప్రతి క్లాసు సమయంలో విద్యార్థుల సీట్లను మార్చడాన్ని మరో ప్రత్యామ్నాయంగా సూచిస్తున్నారు. ఉపాధ్యాయులు దీన్ని సమయం వృథాగా భావించకూడదని, విద్యార్థులకు ఇది రీఫ్రెష్‌లా ఉంటుందని చెబుతున్నారు.ప్రైవేట్ స్కూళ్లలో ఏం అనుసరిస్తున్నారు?చాలా ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థులను మార్చి, మార్చి కూర్చోబెడుతున్నారు. అంటే, ఈ విధానంలో చివరి బెంచీలో ఎప్పుడూ ఒకే విద్యార్థులు ఉండరు. కొంత కాలంగా చాలా స్కూళ్లలో కనీసం రెండు రోజులకు ఒకసారి బెంచీల్లో విద్యార్థులు కూర్చునే స్థానాలను మారుస్తున్నారు. తల్లిదండ్రులు ప్రశ్నించడం వల్లే ఈ విధానం అమల్లోకి వచ్చింది.‘మా పిల్లవాడిని చివరి బెంచ్‌లో ఎందుకు కూర్చోబెడుతున్నారు, ఫస్టు బెంచీలో కూర్చోబెట్టండి అని చాలా మంది తల్లిదండ్రులు అడుగుతున్నారు. అందువల్ల ప్రతి 2 రోజులకు ఒకసారి విద్యార్థులు కూర్చునే స్థానాలను మారుస్తున్నాం’ అని హైదరాబాద్‌‌లో ఓ ప్రముఖ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ చెప్పారు.ఫిన్లాండ్‌లో విద్యా వ్యవస్థకు ప్రపంచంలోనే నాణ్యమైనదిగా గుర్తింపు ఉంది. అక్కడ కొన్ని స్కూళ్లలో సోఫాలు, తిరిగే కుర్చీలు, ఆధునిక టేబుళ్లను ఉపయోగిస్తున్నారు. కొన్ని పీరియడ్ల తర్వాత తరగతి గదులు కూడా మారతాయి. క్లాసులను బట్టి విద్యార్థులు కూర్చునే విధానమూ మారుతుంది.చివరగా..మొత్తంమీద U ఆకారంలో కూర్చోబెట్టడం వల్ల విద్యావ్యవస్థ మొత్తం మారిపోదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలని, సౌకర్యాలను మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు. తరగతి సీలింగ్ నుంచి వాన నీరు కురుస్తుంటే, సీలింగ్‌ ముక్కలుగా విరిగి పడుతుంటే, చెట్ల కింద తరగతులు నిర్వహిస్తుంటే.. బాగు చేయకుండా, సీట్లను మార్చడం గురించి చర్చ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. చాలా పాఠశాలల్లో సరైన మరుగుదొడ్లు లేవని, తాగునీరు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అరకొర వసతుల మధ్య ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యను ఎలా అందించగలవు..? ఆలోచించాల్సిందే..!