YSRCP: ముద్రగడకు అస్వస్థత.. హైదరాబాద్‌కు తరలింపు!

Wait 5 sec.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం (ముద్రగడ పద్మనాభం రెడ్డి) అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా ప్రొస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ముద్రగడ.. కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రెండు రోజుల కిందట చేరినట్లు సమాచారం. అయితే షుగర్ లెవల్స్ పడిపోవటంతో ముద్రగడను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు క్యాన్సర్‌తో బాధపడుతున్నారంటూ ఆయన కుమార్తె క్రాంతి ఇటీవల పేర్కొనడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ముద్రగడ ఆరోగ్యంపై క్రాంతి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ముద్రగడ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని.. అయితే ఆయనకు సరైన వైద్యం అందించడం లేదంటూ క్రాంతి ట్వీట్లో ఆరోపించారు. ముద్రగడను ఎవరూ కలవకుండా బంధించారంటూ.. తన సోదరుడైన గిరిపై క్రాంతి సంచలన ఆరోపణలు చేశారు. ఉద్దేశపూర్వకంగా ముద్రగడకు అందించాల్సిన చికిత్సను నిరాకరిస్తున్నారంటూ క్రాంతి ఆరోపణలు చేశారు. అయితే కుమార్తె క్రాంతి ఆరోపణలను ముద్రగడ పద్మనాభం ఖండించారు. ప్రజలకు బహిరంగ లేఖ రాసిన ఆయన.. తమ కుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తోందంటూ క్రాంతిపై విమర్శలు చేశారు. మనస్పర్దల కారణంగా.. ఆ కుటుంబం జోలికి తాము వెళ్లకపోయినా తమను అదేపనిగా టార్గెట్ చేస్తున్నారంటూ క్రాంతి పేరు ప్రస్తావించకుండా మండిపడ్డారు. తన కొడుకు గిరిబాబు ఎదుగుదల చూడలేకపోతున్నారని.. క్యాన్సర్ వచ్చినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. తాను వైద్యం చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నానంటే గిరిబాబే కారణమంటూ ముద్రగడ చెప్పుకొచ్చారు. ముద్రగడ పద్మనాభం గతంలో రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవారు. ఆ తర్వాత పార్టీలకు దూరంగా ఉంటూ కాపు ఉద్యమాన్ని నడిపారు. ఇక 2024 ఏపీ ఎన్నికలకు ముందు రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ కావాలనే ఉద్దేశంతో.. జనసేన పార్టీలో చేరాలని భావించారు.. అయితే పవన్ కళ్యాణ్ నుంచి ఆహ్వానం అందకపోవడంతో ముద్రగడ పద్మనాభం అనూహ్యంగా వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీచేసిన పిఠాపురంలో అభ్యర్థి గెలుపు కోసం పనిచేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరు మార్చుకుంటానని ప్రకటించిన ముద్రగడ.. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలవడంతో తన పేరును ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకున్నారు.