ముద్రగ పద్మనాభం హైదరాబాద్ తరలింపు.. వైఎస్ జగన్ సూచనతో నిర్ణయం

Wait 5 sec.

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభరెడ్డిని కాకినాడ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ముందుగా ముద్రగడను.. కుటుంబసభ్యులు ఆయన కోరికపై కిర్లంపూడికి అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. ముద్రగడ వెంట పిఠాపురం వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ వంగా గీత కూడా కిర్లంపూడి వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ముద్రగడ పద్మనాభం వెంట ఆయన కుమారుడు గిరిబాబు, ఇతర కుటుంబసభ్యుల ఉన్నారు. ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించనున్నారు. ముద్రగడ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. కాకపోతే ముందస్తు జాగ్రత్తగా, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించినట్లు చెబుతున్నారు.ముద్రగడ పద్మనాభం రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురికావడంతో వెంటనే కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే శనివారం రాత్రి ముద్రగడ మరోసారి అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్ తరలించాలని భావించారు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి హైదరాబాద్ వరకు ప్రయాణం చేసేందుకు అనుకూలంగా లేదనడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఈ విషయం తెలియడంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముద్రగడ కుమారుడు గిరిబాబును ఫోన్‌లో పరామర్శించారు. పద్మనాభం ఆరోగ్యంపై ఆరా తీశారు. ఒకవేళ అత్యవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేసి హైదరాబాద్ తరలించాలని సూచించారు. అయితే ముద్రగడ కాస్త కోలుకున్నారని చెప్పడంతో ట్రీట్మెంట్ కొనసాగించారు. అయితే ఇవాళ ఆయన్ను హైదరాబాద్‌కు తరలించారు. ముద్రగడ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ముద్రగడ కుమారులు బాలు, గిరిబాబులు ధన్యవాదాలు తెలిపారు. ముద్రగడ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వైఎస్ జగన్ సూచన మేరకు హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు మద్రగడ ఆరోగ్యంపై ఆయన కుమార్తె క్రాంతి ఆందోళన వ్యక్తం చేశారు. తన తండ్రికి రహస్యంగా ఎందుకు వైద్యం అందిస్తున్నారని ప్రశ్నించారు. ఆమె ఆదివారం ముద్రగడను చూసేందుకు కాకినాడలోని ఆస్పత్రికి వచ్చారు. ఆమె లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో అక్కడి సిబ్బందిపై మండిపడ్డారు. తన సోదరుడు గిరి ఆస్పత్రిలో తండ్రిని పరామర్శించకుండా అడ్డుకున్నారని.. నర్సులు ఎందుకు తలుపులు వేశారని ప్రశ్నించారు. అయితే ఆ తర్వాత ఆమె తండ్రిని చూసేందుకు అనుమతించడంతో వెళ్లారు. తన తండ్రి తన చేయి పట్టుకుని మాట్లాడేందుకు ప్రయత్నించారన్నారు. తన తండ్రిని వైద్యం పేరుతో మూడు ఆస్పత్రులు తిప్పారని.. ఆయన విషయంలో అంత రహస్యం ఎందుకో చెప్పాలన్నారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులకు కూడా వివరాలు చెప్పడం లేదన్నారు క్రాంతి. పద్మనాభం క్యాన్సర్‌తో బాధపడుతున్నారని.. అలాంటప్పుడు ఆయనకు ఆస్పత్రలో డయాలసిస్‌ జరుగుతోందని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు క్రాంతి.