ఏపీలో దేనికి పనికిరాని ఆ మొక్కతో ఎరువు తయారీ.. టన్ను ఏకంగా రూ.12వేలు, వివరాలివే

Wait 5 sec.

ఏపీలో ఓ వినూత్న ప్రయోగం చేశారు.. పంట కాలువల్లో, చెరువుల్లో ఉండే గుర్రపుడెక్కతో సేంద్రీయ ఎరువు తయారు చేస్తున్నారు. గుర్రపుడెక్క పంట కాలువల్లో ఎక్కువగా కనిపించే మొక్క.. ఈ మొక్క దెబ్బకు ప్రజలతో పాటుగా పశువులు ఇబ్బందిపడుతున్నాయి.. ఇది నీటి ప్రవాహానికి అడ్డుగా ఉంటుంంది. ప్రభుత్వం చెరువుల్లో, పంట కాలువల్లో ఈ ఏటా చాలా డబ్బు ఖర్చు చేస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం లభించింది. ఈ సమస్యకు పరిష్కారంగా ఎరువు తయారీని మొదలు పెట్టారు. పశ్చిమ గోదావరి కలెక్టర్ చదలవాడ నాగరాణి గుర్రపుడెక్కతో సేంద్రియ ఎరువు తయారీ వైపుగా వినూత్నంగా ఆలోచన చేశారు. ఈ మేరకు డీఆర్డీఏ పీడీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆకివీడు మండలం సిద్ధాపురంలోని సంపద తయారీ కేంద్రంలో ఈ ఎరువు తయారీ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ విధానం ద్వారా రైతులకు సమస్య తీరడంతోపాటు.. మహిళలకు ఉపాధి కూడా లభిస్తుంది.ఈ మేరకు సిద్ధాపురంలో 3×9 అడుగుల కుండీల్లో ఈ ఎరువును తయారు చేస్తున్నారు. ముందుగా వీరు కుండీలో గడ్డిని ఒక పొరగా వేస్తారు.. దానిపైన గుర్రపుడెక్కను ముక్కలుగా చేసిన మరో పొరగా వేస్తారు. దానిపైన ఆవు పేడను రెండు అంగుళాల మందంలో ఏడు నుంచి ఎనిమిది పొరలుగా వేస్తారు. అనంతరం 21 రోజుల పాటు దానిని అలా వదిలేస్తారు. అప్పుడు మైక్రోబయల్ కల్చర్ ను వాడి కంపోస్టింగ్ ప్రక్రియను పూర్తి చేస్తారు.. ఈ మిశ్రమాన్ని ఏడు వారాల తర్వాత గుళికలుగా తయారు చేస్తున్నారు. అయితే ఈ ఎరువు తయారీ చేసే ప్రాంతంలో క్రిమికీటకాలు చేరే అవకాశం ఉండటంతో ఈ ప్రక్రియను ఇళ్లకు, గోదాములకు దూరంగా ప్లాన్ చేశారు.కొద్దిరోజులుగా ఈ సేంద్రీయ ఎరువు తయారు చేసి.. సాధారణ సేంద్రియ ఎరువు కంటే గుర్రపుడెక్క ఎరువు రెండు మూడు రెట్లు నాణ్యంగా ఉంటుందని గుర్తించారు. ఈ గుర్రపు డెక్క త్వరగా కుళ్లిపోవడంతో పాటుగా పశువుల వ్యర్థాల కన్నా ఇందులో పొటాషియం, కాపర్, మాంగనీస్, సేంద్రియ కర్బనం, జింక్, ఐరన్, నత్రజని, భాస్వరం వంటి పోషకాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఆరు నెలల వరకు ఈ సేంద్రియ ఎరువును నిల్వ చేయొచ్చు అంటున్నారు. ప్రధానంగా ఈ ఎరువును కొబ్బరి, ఆయిల్‌ఫామ్, మామిడి, సపోటా, వరి, ఉద్యాన పంటలు, మిద్దె తోటలు, కూరగాయలకు ఉపయోగించవచ్చు అంటున్నారు. ఇలా గుర్రపుడెక్కతో ఎరువు తయారీ చేసే విధానాన్ని మహిళా సంఘాలకు అప్పగించడంతో వారికి ఆర్థికంగా తోడ్పాటు అందించినట్లు అవుతుంది. ఇటు రైతులకు నాణ్యమైన ఎరువును తక్కువ ధరకే అందించినట్లే.. ప్రస్తుతం గుర్రపుడెక్కతో తయారుచేసిన ఈ సేంద్రియ ఎరువు కిలో రూ.12 నుంచి రూ.15 వరకు పలుకుతోందట. అదే టన్ను ఎరువు ధర రూ.12 వేల వరకు ఉందట. ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో 100 యూనిట్లు ఏర్పాటు చేయడానికి అడుగులు వేస్తున్నారు. 50 రోజుల పాటు ఒక్కో యూనిట్‌లో 20 మందికి పని దొరుకుతుందని.. రైతులు కూడా స్వయంగా ఈ ఎరువును తయారు చేసుకునేలా అవగాహన కల్పిస్తామంటున్నారు అధికారులు.