పగలంతా బస్సు నడిపి ఓ చిన్న కునుకేసిన డ్రైవర్.. తెల్లారి చూస్తే, ఇదేందయ్యా సామీ!

Wait 5 sec.

పగలంతా బస్సు నడిపి, నడిపి ఆ బస్సు డ్రైవర్ అలిసిపోయారు. ఎప్పుడు డ్యూటీ ముగుస్తుందిరా దేవుడా అంటూ ఎదురుచూస్తూ ఉండగానే.. పని వేళలు పూర్తి అయ్యాయి. నేరుగా బస్టాండ్‌లో బస్సు నిలిపి.. రెస్ట్‌రూమ్‌లో కునుకేశారు. పొద్దస్తమానం పనిచేయడంతో సులువుగానే నిద్రపట్టేసింది. కానీ తెల్లారగానే అసలు సినిమా కనిపించింది. దీంతో లబోదిబోమంటూ అధికారులను ఆశ్రయించారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన ఈ ఘటన.. బస్సు డ్రైవర్‌ను భయాందోళనకు గురిచేస్తే.. చూసినవారికి, విన్నవారికి మాత్రం ఔరా అంటూ నవ్వు తెప్పిస్తోంది.*ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లాలో ఓ ప్రబుద్ధుడు ఏకంగా ఆర్టీసీ బస్సుకే టెండర్ పెట్టాడు. ఆర్టీసీ బస్సునే చోరీ చేసి ఎత్తుకెళ్లాడు. అయితే సీన్ రివర్సై.. పోలీసుకు చిక్కిపోయాడు. ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విధుల్లో భాగంగా మంగళవారం రాత్రికి నెల్లూరు చేరుకుంది. నెల్లూరులోని ఆత్మకూరు బస్టాపులో బస్సును పార్క్ చేసిన డ్రైవర్ జిలాని రెస్ట్ రూమ్‌లో నిద్రపోయారు. అయితే బుధవారం తెల్లవారుజామున వచ్చి చూసి వారు షాక్ తిన్నారు. బస్టాపులో బస్సు కనిపించలేదు. దీంతో కంగారుపడిపోయి వెంటనే ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించారు డ్రైవర్. దీంతో ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసులకు సమాచారం అందించగా.. వారు టోల్ గేట్ సిబ్బందిని అలర్ట్ చేశారు.*చివరకు వారి ప్రయత్నం ఫలించింది. బుచ్చిరెడ్డిపాలెం టోల్‌గేట్ వద్ద బస్సు వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో నెల్లూరు పాలెం సర్కిల్ వద్దకు చేరుకున్న పోలీసులు బస్సును అడ్డుకున్నారు. బస్సును చోరీచేసిన దొంగను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు విడవలూరు మండలం కంచర్లకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అయితే ఎందుకు బస్సును చోరీ చేశాడా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ విషయమై అతణ్ని ఆరా తీస్తున్నారు. *మరోవైపు బంగారు నగలను తక్కువ ధరకు అమ్ముతామంటూ మోసం చేస్తున్న నెల్లూరు జిల్లా వాసులను నిర్మల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగం మండలం రాళ్లచెలికకు చెందిన మల్యాద్రి అనే వ్యక్తి, అతడి భార్య సుభాషిణి కూలీ పనులు చేసుకుని జీవిస్తుంటారు. అయితే అది సరిపోక నకిలీ బంగారం తయారు చేసి మోసం చేయటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని నిర్మల్ సోన్‌ మండలం గాంధీనగర్‌లో ముగ్గురికి తక్కువకే బంగారు ఆభరణాలు అమ్ముతామని ఆశ చూపించారు. తులం రూ. 20 వేలకే ఇస్తామంటూ వారికి10 తులాల నకిలీ బంగారు ఆభరణాలను రూ.2 లక్షలకు అంటగట్టారు. అయితే ఆ తర్వాత బంగారాన్ని పరీక్షించుకున్న నిర్మల్ వాసులు.. మోసపోయామని గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మంగళవారం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.