హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్.. త్వరలో డ్రైవర్‌లేని 'రాపిడ్‌ పాడ్ ట్యాక్సీ'లు, ఈ మార్గాల్లోనే..!

Wait 5 sec.

రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీతో హైదరాబాద్ నగరం ట్రాఫిక్ సమస్యతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సాధారణ సమయాల్లోనే కాకుండా, ప్రధాన రహదారులు జలమయం కావడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) పరిధిలోని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (UMTA) ప్రత్యామ్నాయ రవాణా విధానాలపై దృష్టి సారించింది.UMTA చేపట్టిన అధ్యయనంలో విదేశాల్లో పలు నగరాల్లో విజయవంతంగా అమలవుతున్న (PRT) విధానం హైదరాబాద్‌కు అనువుగా ఉంటుందని తేలింది. ఈ PRT వ్యవస్థలో చిన్న 'పాడ్స్' (బాక్సులు) ఉంటాయి, వీటిలో 4-6 మంది ప్రయాణికులు తమ లగేజీతో సహా సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. డ్రైవర్ రహితంగా, పూర్తిగా ఆటోమేటిక్‌గా, బ్యాటరీతో నడిచే ఈ పాడ్‌లు వాయు కాలుష్యానికి ఆస్కారం లేకుండా రోజుకు 2 లక్షల మంది వరకు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చగలవు.ఈ పీఆర్టీ వ్యవస్థ ఏర్పాటుకు ఉన్న అదనపు ప్రయోజనం భూసేకరణ అవసరం లేకపోవడం. ప్రస్తుతం ఉన్న రోడ్ల మధ్యలో లేదా రోడ్లకు ఇరువైపులా ఈ సేవలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు. అధ్యయనం చేస్తున్న మార్గాల్లో రోడ్లకు ఇరువైపులా తగినంత స్థలం ఉండటం ఈ ప్రాజెక్టుకు మరింత అనువుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. PRT సేవలను ఏర్పాటు చేయడానికి గతంలో కొన్ని ప్రధాన మార్గాలు ప్రతిపాదించారు. కాచిగూడ - ఎంజీబీఎస్‌ - జూపార్కు - ఎయిర్‌పోర్టు, రాయదుర్గ్‌ మెట్రో స్టేషన్‌ - ఫైనాన్షియల్ డిస్ట్రిక్, రాయదుర్గ్‌ మెట్రో స్టేషన్‌ - నాలెడ్జ్‌ సిటీ మార్గాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ మార్గాలు ప్రధానంగా నగరంలోని ఐటీ కారిడార్, వాణిజ్య కేంద్రాలు, రద్దీగా ఉండే ప్రాంతాలను కలుపుతూ లాస్ట్ మైలు అనుసంధానతను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయని భావిస్తున్నారు. PRT వ్యవస్థ అమలులోకి వస్తే హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు గణనీయంగా తగ్గుతాయని, ప్రయాణ సమయం ఆదా అవుతుందని, నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.