ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మామిడి రైతులకు అండగా నిలిచింది.. ఈ మేరకు వారికి సబ్సిడీని అందజేస్తోంది. తాజాగా మరోసారి చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి రైతులకి ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వనుంది. ఇప్పటివరకు సేకరించిన మామిడికి కిలోకు రూ.4 చొప్పున సబ్సిడీ ఇస్తారు. ఈ సబ్సిడీ మొత్తం రూ.150 కోట్లు త్వరలోనే రైతుల ఖాతాల్లో ఈ డబ్బు జమ చేస్తామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో మామిడి పంట వివరాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జేసీ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడెల్, వ్యవసాయశాఖ జేడీ మురళీకృష్ణ, ఉద్యానశాఖ డీడీ మధుసూదన్, పమార్కెటింగ్ శాఖ ఏడీ పరమేశ్వరన్, ట్టుశాఖ జేడీ పద్మావతి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. సబ్సిడీ సక్రమంగా అందేలా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. జూన్ నెలలో సేకరించిన మామిడికి జులైలో సబ్సిడీ ఇస్తారు. జులైలో సేకరించిన మామిడికి ఆగస్టులో సబ్సిడీ ఇస్తారు. ఏపీ ప్రభుత్వం 2.25 లక్షల మెట్రిక్ టన్నుల మామిడిని సేకరించింది. ఈ మేరకు 22,435 మంది రైతుల వివరాలను మండల స్థాయి బృందాలకు అందిస్తారు. ఈ మేరకు గ్రామ స్థాయి అధికారులతో మండల వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు కలిసి రైతుల వివరాలను పరిశీలిస్తారు. రైతుల బ్యాంకు ఖాతాలు, IFSC కోడ్, ఈ-క్రాప్ వివరాలను సరి చూస్తారు. చిత్తూరు జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు తరలించిన కూడా ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుంది.. ఈ మేరకు వారి జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారుల్ని ఆదేశించారు. కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం, రొంపిచెర్ల, పలమనేరు, పులిచెర్ల, యాదమరి, సదుం మండలాల అధికారులతో మాట్లాడారు. మామిడి కాయలకు సంబంధించి సబ్సిడీ సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడాలని.. ఆ బాధ్యత మండల అధికారులపై ఉంది అన్నారు. మొత్తం మీద రైతులకు మరో రూ.150 కోట్లు డబ్బులు బ్యాక్ అకౌంట్‌లలో జమ చేయనున్నారు అధికారులు.