స్కూల్‌ భవనంపై కూలిన సైనిక విమానం.. బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం

Wait 5 sec.

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. రాజధాని ఢాకాలో సోమవారం మధ్యాహ్నం ఓ సైనిక విమానం కుప్పకూలింది. ఢాకా ఉత్తరా ప్రాంతంలో ఉన్న మైల్‌స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ ప్రాంగణంలో బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన శిక్షణ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో కనీసం ఒకరు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన విమానం బంగాదేశ్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన F-7 BGI జెట్ అని ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. పది మందికిపైగా విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం.విమానం కూలిన తర్వాత ఘటనా స్థలిలో మంటలు చెలరేగి, దట్టమైన పొగలు ఎగసిపడుతున్న దృశ్యాలను స్థానిక మీడియా ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక, సైనిక బృందాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మంటలను అదుపుచేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.అగ్నిమాపక విభాగం అదికారి లిమా ఖాన్ మాట్లాడుతూ.. ‘విమానం కూలిన ఘటనలో కనీసం ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నలుగురికి గాయాలయ్యాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది’ అని తెలిపారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.