కలియుగ ప్రత్యక్ష దైవం, వేంకటేశ్వర ఆలయానికి సంబంధించి.. అనేక వదంతులు తరచూ వస్తూనే ఉంటాయి. ఇటీవలె అలిపిరి మెట్ల మార్గంలో మద్యం సీసాలు కనిపించినట్లు ఆరోపణలు రాగా.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. అలిపిరి నడక మార్గంలో చికెన్ బిర్యానీ అందించే హోటల్స్ ఉన్నాయంటూ చూపించే యాడ్స్‌కు సంబంధించిన బారికేడ్లకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో వెనకాల శ్రీవారి పవిత్ర నామాలను ఆడియోను ఉంచి వైరల్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోను వైసీపీకి చెందిన అఫీషియల్ ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేయడంతో.. కామెంట్లు, షేర్లు అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎట్టకేలకు ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఒక క్లారిటీ ఇచ్చింది. "శ్రీవారి భక్తుల మనోభావాలను రెచ్చగొట్టేలా తిరుమలపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. అలిపిరి నడక మార్గంలో చికెన్ బిర్యానీ హోటల్స్‌కు సంబంధించిన ప్రకటనలు ఉంచినట్లు ఒక ఫేక్ వీడియోను ప్రచారం చేస్తున్నారు. చంద్రగిరికి వెళ్లే రోడ్డుపై ఉంచిన రోడ్ బారికేడ్‌పై ఉన్న హోటల్ ప్రకటనకు స్వామివారి పవిత్రనామం ఆడియోను జత చేసి కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు గుర్తించడమైంది. పవిత్రమైన తిరుమల క్షేత్రంపై భక్తులకు విశ్వాసం పోయే విధంగా జరుగుతున్న అసత్య ప్రచారాలను గ్రహించి భక్తులు సహకరించాల్సిందిగా మనవి" అంటూ ఏపీ ఫ్యాక్ట్ చెక్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. దీంతో వైసీపీ షేర్ చేసిన వీడియో ఫేక్ అని తేల్చి చెప్పింది. ఇక వైసీపీ సోషల్ మీడియా చేసిన ఎక్స్ పోస్ట్‌లోని నకిలీ వీడియోకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. అయితే అంతకుముందు వైసీపీ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేసింది. "శ్రీవారి భక్తులకు చికెన్ బిర్యానీ హోటల్స్ ప్రకటనలతో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అలిపిరిలో స్వాగతం. గోవింద నామస్మరణతో అలిపిరి మెట్ల మార్గంలో వెళ్తున్న భక్తులకు దర్శనమిస్తున్న నాన్‌వెజ్ ఫుడ్ హోటల్స్ ప్రకటనలు. పరమ పవిత్రంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శననానికి వెళ్తుంటే.. ఈ బిర్యానీ బోర్డులేంటి? అని వాపోతున్న భక్తులు. ఇటీవల అలిపిరి మెట్ల మార్గంలో దర్శనమిచ్చిన మద్యం సీసాలు.. ఇప్పుడు బిర్యానీ బోర్డులు. టీటీడీ విజిలెన్స్ విభాగం నిద్రపోతోందా? భక్తుల మనోభావాలు మీకు పట్టవా చంద్రబాబూ?" అంటూ ఒక వీడియోను ట్వీట్ చేసింది. ఇక ఇదే వైరల్ వీడియోకు సంబంధించి అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కూడా స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో నకిలీది అని స్పష్టం చేసింది. ఆ బారికేడ్‌ ఉన్న ప్రాంతం తిరుమల పరిధిలోకి రాదని.. ఆ రోడ్డు చంద్రగిరికి వెళ్లేది అని తెలిపింది. ఇలాంటి ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ తీవ్ర హెచ్చరికలు చేసింది.