కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. సోనియా గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ న్యాయస్థానం కొట్టేసింది. అయితే గతంలో భారత పౌరసత్వం పొందడానికి ముందే.. ఆమె పేరు ఓటర్ జాబితాలో రిజిస్టర్ చేసుకున్నారని.. ఢిల్లీ కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. 1983లో సోనియా గాంధీకి భారత పౌరసత్వం లభించగా.. ఆమెకు అంతకు 3 ఏళ్ల ముందుగా అంటే 1980లోనే సోనియా గాంధీ ఓటర్‌గా రిజిస్టర్ చేసుకున్నారని పిటిషన్ వేశారు. దీంతో ఆమె ఎన్నికల చట్టాన్ని అతిక్రమించారని.. అందుకు సోనియా గాంధీపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని ఆ పిటిషన్‌లో ఢిల్లీ కోర్టును పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పేర్కొన్నారు. 1983లో సోనియా గాంధీకి భారత పౌరసత్వం లభించిందని.. కానీ 1980 నాటి ఓటర్ జాబితాలో సోనియా గాంధీ పేరు ఉందంటూ గత నెలలో బీజేపీ నేత అమిత్ మాలవీయ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. గాంధీ కుటుంబానికి చెందిన ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ, సంజయ్ గాంధీ, మేనకా గాంధీల పేర్లను చేర్చినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఓటర్ జాబితాలో సోనియా గాంధీ పేరు ఉన్న నాటికి.. ఆమెకు ఇటలీ పౌరసత్వం ఉందని తెలిపారు. దీంతో అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో 1982లో సోనియా గాంధీ పేరును ఓటర్ లిస్ట్ నుంచి తొలగించారని.. ఆ తర్వాత మళ్లీ 1983లో ఆమె పేరు ఓటర్ జాబితాలో కనిపించినట్లు అమిత్ మాలవీయ పేర్కొన్నారు. అయితే 1983లో భారత పౌరసత్వం రావడం కంటే ముందే సోనియా గాంధీ పేరును మళ్లీ ఓటర్ జాబితాలోకి చేర్చినట్లు ఆయన విమర్శలు చేశారు. రాజీవ్‌ గాంధీని సోనియా గాంధీ పెళ్లి చేసుకున్న తర్వాత.. ఆమెకు భారత పౌరసత్వం వచ్చేందుకు 15 ఏళ్లు ఎందుకు పట్టిందనే ప్రశ్న తాను వేయడం లేదని.. అయితే పౌరసత్వం రావడానికి ముందే ఆమె పేరు ఓటర్ జాబితాలో రావడం ఎన్నికల ప్రక్రియను దుర్వినియోగమేనని అమిత్ మాలవీయ తేల్చి చెప్పారు. అయితే ఈ వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌ను మాత్రం ఢిల్లీ కోర్టు కొట్టివేయడం గమనార్హం.ఇక మరికొన్ని రోజుల్లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)ను చేపట్టడం దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. అయితే ఈ ఎస్ఐఆర్‌లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్‌ గాంధీ బిహార్‌లో ఓటర్‌ అధికార్‌ యాత్ర పేరుతో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఇక గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్ర సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి ఓట్లు చోరీ చేసి గెలిచిందని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ల చోరీ విమర్శలకు కౌంటర్‌గా.. బీజేపీ , ఓటర్ ఐడీ వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చింది.