దేశంలో మావోయిస్ట్‌ల ఉనికి లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో గత కొన్ని నెలలుగా నక్సల్స్‌పై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2026 నాటికి దేశంలో నక్సల్స్ లేకుండా చూస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే దేశంలో ఎక్కువ మంది నక్సల్స్ తలదాచుకుంటున్న ఛత్తీస్‌గఢ్‌లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఈ నేపథ్యంలోనే అడవుల్లో భారీ ఎత్తున నక్సల్స్ ఆచూకీ కోసం కూంబింగ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే భారీగా ఎదురు కాల్పులు, ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. గత కొన్ని నెలలుగా ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న వరుస ఎన్‌కౌంటర్లలో వందల సంఖ్యలో మావోయిస్ట్‌లు నేలకొరిగారు. తాజాగా మరోసారి భారీ ఎత్తున ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. గరియాబంద్ జిల్లాలో భద్రతా బలగాలు చేపట్టిన మేజర్ ఆపరేషన్‌లో 10 మంది మావోయిస్ట్‌లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో కీలక నేతలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ ఉన్నారని భద్రతా దళ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. మోడెం బాలకృష్ణ స్వస్థలం తెలంగాణ కావడం గమనార్హం. ఇతడిపై కోటి రూపాయల రివార్డ్ ఉన్నట్లు తెలిపారు. మరోవైపు.. ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రమోద్‌ అలియాస్ పాండు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి.. 10 మంది మావోయిస్ట్‌ల మృతదేహాలతోపాటు భారీ మొత్తంలో ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో గరియాబంద్‌ ఈ30, కోబ్రా జవాన్లు, ఎస్‌టీఎఫ్‌ బలగాలు పాల్గొన్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌ను గరియాబంద్‌ ఎస్పీ నిఖిల్‌ రఖేచా అనుక్షణం పర్యవేక్షించారు.