Petrol Price: పెట్రోల్, డీజిల్ ధరలను వస్తు సేవల పన్ను (GST) పరిధిలోకి తీసుకురావాలనే వాదనలు చాలా కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. జీఎస్టీ కిందకు తీసుకొస్తే పెట్రోల్, డీజిల్ ధరలు ధరలు భారీగా తగ్గి వాహనదారులపై భారం తగ్గుతుంది. అయితే, ఎప్పటికప్పుడు ప్రభుత్వం స్పష్టత ఇస్తూ వస్తోంది. తాజాగా వస్తు సేవల పన్ను జీఎస్టీలో కీలక మార్పులు జరిగాయి. నాలుగు శ్లాబుల నుంచి రెండు తొలగించింది కేంద్రం. ఇప్పుడు 5, 18 శ్లాబులు మాత్రమే ఉన్నాయి. దీంతో చాలా వస్తువుల ధరలు తగ్గుతున్నాయి. సెప్టెంబర్ 22, 2025 నుంచే కొత్త పన్ను రేట్లు అమలులోకి రాబోతున్నాయి. ప్రభుత్వం జీఎస్టీలో కీలక మార్పులు చేస్తున్న క్రమంలో పెట్రోల్, డీజిల్‌లోను జీఎస్టీ కిందకు తెస్తున్నారనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ విభాగం (CBIC) ఛైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ క్లారిటీ ఇచ్చారు. జీఎస్టీ కిందకు పెట్రోల్, డీజిల్ ఎప్పుడు తీసుకొస్తారు? కేంద్ర వద్ద ప్రతిపాదన ఉందా? అనే ప్రశ్నలు ఎదురైన క్రమంలో సమాధానమిచ్చారు. ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ సహా అనుబంధ వస్తువులను పరోక్ష పన్నుల పరిధిలోకి తీసుకురావడం సాధ్యం కాకపోవచ్చని అగర్వాల్ అన్నారు. ఎందుకంటే ఈ రెండు పెట్రోలియం వస్తువులని, వ్యాట్ ద్వారా రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఎక్సైజ్ సుంకం ద్వారా గణనీయమైన ఆదాయాన్ని తెస్తాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్రాల ఆదాయానికి ముడిపడి ఉంటుంది కాబట్టి పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం అనేది సాధ్యం కాకపోవచ్చని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో పెట్రోల్ ధరలు గరిష్ఠ స్థాయుల్లోనే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ ఆ ప్రయోజనాలను వినియోగదారులకు అందించలేదు. చమురు మార్కెటింగ్ సంస్థలకు గతంలో వచ్చిన నష్టాలను పూడ్చేందుకే ఉపయోగించారు. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర సగటున రూ.105 పైన కొనసాగుతోంది. లీటర్ డీజిల్ ధర సగటున రూ.95 వరకు ఉంది. చాలా కాలంలో ఈ రేట్లు స్థిరంగానే కొనసాగుతున్నాయి. అయితే, జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే గరిష్ట పన్ను 40 శాతంగా ఉంటుంది. సెస్ ఉండకపోవచ్చ. దీంతో లీటర్ పెట్రోల్ ధర గణనీయంగా తగ్గుతుంది. ఇన్నాళ్లు 28 శ్లాబులోకి తీసుకురావాలన్న డిమాండ్లు ఉండగా ఇప్పుడు ఆ శ్లాబ్ తొలగించారు. ప్రస్తుతం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ 23 శాతం, వ్యాట్ 34 శాతంతో 57 శాతం మేర పన్నులు పడుతున్నాయి.