నకిలీ భారత కరెన్సీ నోట్ల కేసులో అమీర్ జుబైర్ సిద్ధిఖీకి చెన్నైలోని ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) స్పెషల్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అమీర్ జుబైర్ సిద్ధిఖీ.. అక్టోబర్ 15వ తేదీ లోగా కోర్టు ముందు హాజరు కావాలని ఆ సమన్లలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2018లో నకిలీ భారత కరెన్సీ నోట్లను చలామణి చేసిన కేసులో సిద్ధిఖీతో పాటు మరో ఇద్దరిపైనా ఎన్ఐఏ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న సిద్ధిఖీ.. అక్కడ ఉన్న హైకమిషన్‌లో వీసా కౌన్సిలర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే సిద్ధిఖీ పరారీలో ఉన్నట్లు భావించిన ఎన్ఐఏ.. అతనిపై ఇచ్చిన అరెస్ట్ వారెంట్ కూడా పెండింగ్‌లో ఉండటం గమనార్హం.ఈ నకిలీ నోట్ల చలామణికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో భాగంగా ఎన్ఐఏ అతడిని విచారణకు పిలిచింది. ఫేక్ కరెన్సీ చలామణితోపాటు భారత్‌లోని అమెరికా, ఇజ్రాయెల్‌ కాన్సులేట్లు సహా కీలక ప్రాంతాలపై దాడులకు సిద్ధిఖీ కుట్రలు పన్నాడని పేర్కొంది. ఇక కరాచీలోని సిద్ధిఖీ ఇంటి అడ్రస్‌ను కూడా సమన్లలో కోర్టు ప్రస్తావించింది. 2018లో సిద్ధిఖీని వాంటెడ్ జాబితాలో చేర్చిన ఎన్‌ఐఏ.. అతడి ఫొటోను రిలీజ్ చేసింది. మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో 26/11 తరహాలో ఉగ్రదాడులు చేసేందుకు కుట్ర పన్నినట్లు 2018లో దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో పేర్కొంది. 2009 నుంచి 2016 మధ్య కాలంలో సిద్ధిఖీ శ్రీలంకలో పని చేసే సమయంలో గూఢచర్యం, ఉగ్రవాద కార్యకలాపాలు సాగించే వారితో సంబంధాలు కలిగి ఉన్నాడని ఎన్‌ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఈ సిద్దిఖీ వ్యవహారం 2014లోనే వెలుగులోకి వచ్చింది. సిద్దిఖీ ఇచ్చిన ఆదేశాలతో భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు.. శ్రీలంకకు చెందిన మహమ్మద్‌ సఖీర్‌ హుస్సేన్ అప్పట్లో భారత్‌లోకి వచ్చిన చెన్నై పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో ఆ కేసులోనే సిద్ధిఖీపై మొట్టమొదటి కేసు నమోదైంది. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాలతో ఆ కేసును ఎన్‌ఐఏ విచారణ చేపట్టగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.