తెలంగాణకు అధికారులు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 5.30 గంటలకు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి, అదే ప్రాంతంలో ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతోందని వెల్లడించారు. దీని కారణంగా నేడు, రేపు, ఎల్లుండి పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, రంగారెడ్డి, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనవసరపు ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని చాలా ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. సుమారు గంటసేపు కుండపోతగా కురిసిన వర్షానికి రహదారులన్నీ జలమయం అయ్యాయి. గచ్చిబౌలి నుంచి హయత్‌నగర్ వరకు అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం మూడు కుటుంబాలను విషాదంలో ముంచెత్తింది. కుండపోత వర్షానికి నగరంలోని రెండు ప్రాంతాల్లో ముగ్గురు వ్యక్తులు నాలాల్లో కొట్టుకుపోయారు. ఈ ముగ్గురి వయసు 24-26 సంవత్సరాల మధ్య ఉంది. వీరందరూ వివాహితులే. మల్లేపల్లిలో గల్లంతైన అర్జున్, రాములకు నలుగురు చొప్పున పిల్లలు ఉన్నారు. వర్షం సమయంలో వీరు నాలాలో కొట్టుకుపోయారు. ఈ ఘటన వారి కుటుంబాలకు తీవ్ర విషాదాన్ని కలిగించింది. ముషీరాబాద్‌లో కొట్టుకుపోయిన దినేష్ అలియాస్ సన్నీ ఒక అనాథ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ దురదృష్టకర సంఘటన వారి కుటుంబాన్ని అనాథగా చేసింది. జీహెచ్‌ఎంసీ, పోలీసు అధికారులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం దక్కలేదు. సోమవారం రాత్రి వరకు గల్లంతైన వారి ఆచూకీ లభించలేదు.