ఆంధ్రప్రదేశ్‌లో దసరా సెలవుల్లో మార్పు అంశం తెరపైకి వచ్చింది. రెండు రోజులు ముందుగానే దసరా సెలవులు ఇవ్వాలనే డిమాండ్ మొదలైంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ గోపిమూర్తి ప్రభుత్వం దృష్టికి కొన్ని విజ్ఞప్తులు చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో దసరా సెలవులను మార్చాలని ఆయన కోరారు. విద్యార్థులకు దసరా సెలవులు 22వ తేదీ నుంచే ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విద్యా క్యాలెండర్ ప్రకారం సెలవులు 24 నుంచి ఇస్తున్నారు. కానీ పండుగ 22న ప్రారంభమవుతుంది కాబట్టి.. ఆ రోజు నుంచే సెలవులు ఇవ్వాలని ఆయన కోరారు. వాస్తవానికి తెలంగాణలో దసరా సెలవులు ఈ నెల 21 (ఆదివారం) నుంచి మొదలవుతున్నాయి. ఏపీలో కూడా ఈ నెల 22 నుంచి దసరా సెలవులు ఇస్తే కనుక.. మరో రెండు రోజులు సెలవులు కలిసొస్తాయంటున్నారు. అంటే ఈ నెల 21 నుంచే సెలవులు ఇచ్చినట్లు అవుతుంది. అయితే ప్రభుత్వం మాత్రం స్కూళ్లకు, కాలేజీలకు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే రెండు రోజులు ముందు నుంచే ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఇస్తే మొత్తం 9 రోజుల పాటూ సెలవులు ఇచ్చినట్లు అవుతుంది. అదే ఈ నెల 22 నుంచి కనుక ఇస్తే.. దాదాపు 11 రోజుల పాటూ సెలవులు రానున్నాయి.. ఈ నెల 21 ఆదివారం కాబట్టి మొత్తం 12 రోజులు సెలవులు వస్తాయి. మరి ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి. అలాగే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల గురించి కూడా ఎమ్మెల్సీ ప్రస్తావించారు. మెగా డీఎస్సీ నియామకాల కంటే ముందే అంతర్ జిల్లా బదిలీలు పూర్తి చేయాలని కోరారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులను చేపట్టాలన్నారు. హైస్కూల్ ప్లస్‌లోని పీజీటీలను స్కూల్ అసిస్టెంట్ల ద్వారానే భర్తీ చేయాలని.. డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకులకు బదిలీలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.