ఆంధ్రప్రదేశ్‌లో ఆ బీసీ కులాన్ని ఓసీల్లో చేరుస్తు్న్నారా.. కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారంలో నిజమెంతో మంత్రి క్లారిటీ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని మంత్రి అన్నారు. రాష్ట్ంరలో శెట్టిబలిజలను ఓసీల్లో చేరుస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రచారం ద్వారా కులాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారన్నారు. ఇది రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునే ప్రయత్నమని.. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగ్గిరెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గీత వృత్తి చేసుకునే వారి గురించి మాట్లాడే అర్హత వైఎస్సార్‌సీపీ నేతలకు లేదన్నారు. కూటమి ప్రభుత్వం వారికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. వారికి మద్యం షాపుల్లో ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తున్నామని.. మద్యం షాపుల్లో, బార్లలో 10% కేటాయించినట్లు మంత్రి తెలిపారు.రాష్ట్రంలో యూరియా కొరత లేదన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. వైఎస్సార్‌సీపీ నేతలు రైతులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రతిపక్షం కాదు, ఒక విషవృక్షంలాంటిదన్నారు. రాజకీయ లబ్ధికోసం వైఎస్సార్‌సీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యూరియా కొరత ఉందని వైఎస్సార్‌సీపీ నేతలు చేస్తున్న ప్రచారం అవాస్తవమన్నారు. రైతుల్ని భయపెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల కోసం యూరియా ఎరువులను భారీగా అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఖరీఫ్ సీజన్ కోసం 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సిద్ధం చేసిందని.. ఆగస్టు నెలాఖరు వరకు 5,69,712 టన్నులు, ఈ నెలలో 94,482 టన్నులు సరఫరా చేశామని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అన్నారు. గత ఐదేళ్లలో జగన్ రెడ్డి ప్రభుత్వం సగటున 5 లక్షల టన్నుల యూరియా మాత్రమే ఇచ్చింది. కానీ, ఈసారి మొదటికే 7 లక్షల టన్నులు అందుబాటులో ఉంచామని మంత్రి చెప్పారు. ఇంకా 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఈ నెల 10వ తేదీలోగా రైతులకు చేరుతుందన్నారు. అంటే త్వరలోనే మరింత యూరియా రైతులకు అందుబాటులోకి వస్తుందన్నారు. వైఎస్సార్‌సీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. యూరియా కొరత ఉందంటూ తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని.. ఇది వైఎస్సార్‌సీపీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. గత ఐదేళ్లలో వైఎస్ జగన్ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి వైఎస్సార్‌సీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని.. యూరియా విషయంలో తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు మంత్రి వాసంశెట్టి సుభాష్.