ఏపీలో పేదలకు గుడ్ న్యూస్.. ఇళ్ల పట్టాల పంపిణీపై కీలక అప్‌డేట్..

Wait 5 sec.

రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. అర్హులైన ప్రతి కుటుంబానికి రాబోయే నాలుగేళ్లల్లో ఇల్లు లేదా ఇంటి స్థలం అందించేలా చూడాలని.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ మేరకు చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు చొప్పున ఇంటి స్థలం అందించేలా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులతో చర్చించిన చంద్రబాబు.. ఇళ్ల స్థలాల పంపిణీ కోసం భూమిని గుర్తించాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో భూమి లభించకపోతే గ్రూప్ హౌసింగ్ విధానం అనుసరించాలని సూచించారు. మరోవైపు ఎవరైనా లబ్ధిదారులు సెంటు పట్టా భూమి తీసుకునేందుకు ఆసక్తి చూపని పరిస్థితుల్లో.. ఆ భూమిని పరిశ్రమల ఏర్పాటు కోసం ఉపయోగించుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. అదే సమయంలో లబ్ధిదారునికి కొత్త ఇళ్ల పట్టాల పథకం కింద ప్రత్యామ్నాయం చూపించాలని స్పష్టం చేశారు. ఆర్థిక లావాదేవీల కేంద్రంగా టౌన్ షిప్‌లను అభివృద్ధి చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. మరోవైపు గత ప్రభుత్వం లబ్ధిదారులు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఆ స్థలంలో ఇళ్ల నిర్మాణాలను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం అదనపు సాయం కూడా అందించింది. ఎస్సీ, బీసీ సామాజిక వర్గాల లబ్ధిదారులకు రూ.50 వేలు చొప్పున, ఎస్టీ సామాజికవర్గ లబ్ధిదారులకు రూ.75 వేలు చొప్పున అదనపు సాయం అందించారు. మరోవైపు ఇళ్ల స్థలాల పంపిణీపై ఇప్పటికే మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. అందరికీ ఇళ్లు పథకం పేరుతో ఈ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అందరికీ ఇళ్లు పథకం కింద గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున ఇంటి స్థలాలు పంపిణీ చేయనున్నారు. మహిళల పేరుతో ఇళ్ల పట్టాలు అందించనున్నారు. ఇంటి పట్టా పొందిన రెండేళ్లలోగా అక్కడ ఇంటి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది. మరోవైపు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే ఇంటి స్థలం అందిస్తారు. ఇక ఇళ్ల స్థలాలకు కన్వేయన్స్‌ డీడ్‌ ఇవ్వనుంది. అలాగే పట్టా పొందిన వారికి పదేళ్లు పూర్తైన తర్వాత మాత్రమే ఆ స్థలంపై పూర్తి హక్కులు లభిస్తాయి. పదేళ్ల తర్వాత మాత్రమే ఫ్రీహోల్డ్‌ హక్కులు ఇచ్చేలా కన్వేయన్స్‌ డీడ్‌‌ను ప్రభుత్వం జారీ చేస్తుంది. మరోవైపుగతంలో కేంద్రం, రాష్ట్ర గృహనిర్మాణ పథకాల్లోనూ లబ్ధిదారుగా ఉంటే పథకం వర్తించదు. అలాగే సొంత ఇంటి స్థలం, ఇల్లు ఉంటే అర్హులు కారు. అందరికీ ఇళ్ల పథకం కింద అర్హత పొందాలంటే రేషన్ కార్డుఉండాలి. 5 ఎకరాల్లోపు మెట్ట, 2.5 ఎకరాల్లోపు మాగాణి ఉంటే అర్హులు.