సీఎంగా నాకు అత్యంత సంతృప్తిని ఇచ్చిన రోజు అదే.: వైఎస్ జగన్

Wait 5 sec.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మోహన్ రెడ్డి సోమవారం ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. 2019 నుంచి 2024 వరకూ వైఎస్ జగన్ ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఐదేళ్ల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించారు వైఎస్ జగన్. అలాగే లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా సాయం అందించే ఎన్నో పథకాలను బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. ముఖ్యమంత్రిగా అభివృద్ధి పనులతో పాటుగా అధినేతగానూ అనేక మరపురాని విజయాలను అందుకున్నారు. అయితే ఐదేళ్ల పాటు సీఎంగా పనిచేసిన సమయంలో తనకు అత్యంత సంతృప్తిని కలిగించిన రోజు ఆ రోజేనంటున్నారు వైఎస్ జగన్. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సోమవారం ఓ ట్వీట్ చేశారు."ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య రంగంలో 15 సెప్టెంబ‌ర్, 2023 ఒక గొప్ప రోజు. ఒక ముఖ్యమంత్రిగా ప‌రిపాల‌నా కాలంలో నాకు అత్యంత సంతృప్తిని మిగిల్చిన రోజు. నేను ఒక మంచి ప‌ని చేయ‌గ‌లిగాన‌న్న తృప్తి నాకు ల‌భించింది. 1923 నుంచి 2019 వ‌ర‌కు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ రంగంలో కేవ‌లం 12 మెడిక‌ల్ కాలేజీలు ఉంటే, ఒక్క మా హ‌యాంలోనే ఒకేసారి 17 మెడిక‌ల్ కాలేజీల‌ను సంక‌ల్పించాం. ఇందులో భాగంగా 2023 సెప్టెంబ‌ర్ 15న విజ‌య‌న‌గ‌రం, రాజ‌మండ్రి, ఏలూరు, మ‌చిలీప‌ట్నం, నంద్యాల మెడిక‌ల్ కాలేజీల‌ను ఒకేసారి ప్రారంభించి ప్రజ‌ల ఆరోగ్య ప‌రిర‌క్షణ‌లో గొప్ప అడుగు ముందుకేశాం.""ఈ ఐదు కాలేజీల ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తేవ‌డం నాకు సంతోషాన్ని క‌లిగించింది. వీటితో పాటు పాడేరు, పులివెందుల కాలేజీల‌ను అడ్మిష‌న్లకు కూడా సిద్ధం చేశాం. మిగిలిన ప‌నుల‌ను పూర్తి చేయాల్సిన ఈ ప్రభుత్వం ఆ 10 కాలేజీల‌ను ప్రైవేటుకు కట్టబెట్టేలా నిర్ణయం తీసుకోవడం అత్యంత దారుణం. ప్రజలంతా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తక్షణం ఈ ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం." అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ఏపీలో ప్రస్తుతం మెడికల్ కాలేజీల వ్యవహారం అధికార, విపక్షాల మధ్య హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తమ హయాంలో 17 కాలేజీ నిర్మాణాలను ప్రారంభించామని వైసీపీ చెప్తుంటే.. వాటిలో చాలా పునాదుల దశ కూడా దాటలేదని అధికార టీడీపీ విమర్శిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. వాటిని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే వైద్య కళాశాలల అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెప్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్ ట్వీట్ ఆసక్తికరంగా మారింది.