2025లో టీమిండియా బోణీ కొట్టింది. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో, టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్.. తమ విలువను చాటుకుంటూ సత్తాచాటింది. తమను ఎందుకు ఫేవరెట్ అంటారో.. తాము ఎలా టీ20 క్రికెట్‌లో ఛాంపియన్‌లుగా ఉన్నామో మరోసారి రుజువు చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి.. పసికూన యూఏఈని మట్టికరిపించింది. తొలుత యూఏఈని 57 పరుగులకు కుప్పకూల్చి.. ఆపై 4.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది.పెవిలియన్‌కు క్యూ కట్టిన యూఏఈ బ్యాటర్లు..ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలుత యూఏఈని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. జట్టు స్కోరు 26 వద్ద జస్‌ప్రీత్ బుమ్రా.. ఓపెనర్ అలిషాన్‌ను క్లీన్ బౌల్డ్ చేసి భారత్‌కు తొలి వికెట్ అందించాడు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందనే అంచనాతో కెప్టెన్ సూర్యకుమార్‌.. మూడో ఓవర్‌లోనే స్పిన్నర్‌కు బంతిని ఇచ్చాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ స్పిన్నర్లు అదరగొట్టారు. దీంతో స్వల్ప వ్యవధిలోనే యూఏఈని వికెట్లు కోల్పోయింది.10 పరుగుల వ్యవధిలో చివరి 8 వికెట్లు డౌన్..ఓ దశలో యూఏఈ 8 ఓవర్లలో 47/2తో నిలిచింది. కానీ ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. కుల్‌దీప్ యాదవ్‌ తిప్పేశాడు. ఓకే ఓవర్‌లో ఏకంగా మూడు వికెట్లు తీశాడు. దీంతో యూఏఈ బ్యాటింగ్ గాడితప్పింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లే పెవిలియన్‌కు చేరిపోయారు. దీంతో 10 పరుగుల వ్యవధిలోనే యూఏఈ చివరి 8 వికెట్లను కోల్పోయింది. 13.1 ఓవర్లలో 57 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 4, శివమ్ దూబె 3 వికెట్లు తీశారు. బుమ్రా, అక్షర్, వరుణ్ ఒక్కో వికెట్ తీశారు.అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన భారత్.. 4.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది. అభిషేక్ శర్మ (16 బంతుల్లో 30) ధాటిగా బ్యాటింగ్ చేశాడు. శుభ్‌మన్ గిల్ (9 బంతుల్లో 20), సూర్యకుమార్ యాదవ్ (2 బంతుల్లో 7 రన్స్‌) నాటౌట్‌గా నిలిచారు. దీంతో ఆసియాకప్‌ 2025ని టీమిండియా విజయంతో ఆరంభించింది. పాయింట్స్‌ టేబుల్‌లో గ్రూప్‌-ఏలో అగ్రస్థానంలో నిలిచింది.