బరువు తగ్గితే కంపెనీ బోనస్.. 20 కిలోలకు రూ.2.5 లక్షలు!

Wait 5 sec.

తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు పండుగలు, మెరుగైన పనితీరు లేదా లాభాలు వచ్చినప్పుడు యాజమాన్యం ప్రోత్సహకాలు, బోనస్‌ ఇస్తుండటం సర్వసాధారణం. కానీ, ఓ కంపెనీ మాత్రం వినూత్నంగా ఆలోచించింది. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఇస్తామని ప్రకటన చేసింది. ఉద్యోగుల్లో ఆరోగ్యం పట్ల అవగాహన, ఆరోగ్యకర జీవనశైలిని అలవాటు చేయడం కోసం ప్రోత్సాహకాన్ని ప్రకటించింది చైనాకు చెందిన కంపెనీ. అయితే, బరువు తగ్గితే బోనస్ ఇస్తారు. కానీ, మళ్లీ పెరిగితే దాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుందని కండిషన్ పెట్టింది. ఇందుకు ప్రత్యేక నిధిని కూడా కేటాయించడం గమనార్హం. వివరాల్లోకి వెళ్లే.. ఇన్‌స్టా 360గా గుర్తింపు పొందిన చైనా సంస్థ అరాషి విజన్‌ తమ ఉద్యోగులకు ఇటీవలే వెయిట్‌లాస్‌ ఛాలెంజ్‌ ప్రారంభించింది. ఇందుకోసం మిలియన్ యువాన్లు (సుమారు రూ.1.1 కోట్లు) నిధిని ఏర్పాటుచేసి.. వారు తగ్గే ప్రతి అరకిలో బరువుకు 500 యువాన్లు (దాదాపు రూ.5,800) బోనస్ ప్రకటించింది. ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లో షీయాకీ అనే ఉద్యోగి 90 రోజుల్లోనే 20 కిలోలు తగ్గి.. 20 వేల యువాన్లు (దాదాపు రూ.2.5 లక్షలు) గెలుచుకుంది. దీంతో ఆమె ‘వెయిట్‌లాస్‌ ఛాంపియన్‌’‌గా అవతరించింది. ఈ సందర్భంగా ఆమె తాను బరువు తగ్గిన విధానం గురించి వెల్లడించింది. మితంగా ఆహారం తీసుకుని, రోజూ గంటన్నర పాటు వ్యాయామం చేసినట్టు తెలిపింది. తన జీవితంలో ఇదో గొప్ప ఎచీవ్‌మెంట్ అని, అందంతో పాటు ఆరోగ్యం కూడా సొంతమైందని పేర్కొంది. సిబ్బంది తమ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ.. వృత్తితో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఉత్సాహంగా ముందుకు వెళ్లేలా ప్రోత్సహించడమే దీని లక్ష్యమని ఆ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. కానీ, ఎవరైనా మళ్లీ బరువు పెరిగితే తీసుకున్న ప్రోత్సహానికి రెట్టింపు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి అర కిలోకు 800 యువాన్లు (దాదాపు రూ.9,300) చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటివరకు ఎవరికీ ఈ జరిమానా చెల్లించే పరిస్థితి రాలేదని తెలిపింది. ఈ ఛాలెంజ్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఉద్యోగుల ఆరోగ్యం విషయంలో కంపెనీ నిర్ణయం మంచి ఆలోచన అని ప్రశంస్తుంటే... బరువు పెరిగితే పెనాల్టీ వేయం సరికాదని మరికొందరు విమర్శిస్తున్నారు.