తిరుపతి దేవస్థానానికి సంబంధించి సోషల్ మీడియా ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. దీనిపై ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వస్తోంది. అయితేతెలిసిందే. అయితే దీనిపై నెట్టింట వివిధ రకాల వార్తలు, విమర్శలు వస్తున్నాయి. మహాద్వారం తాళాలు ఓ ప్రైవేట్ వ్యక్తి చేతిలో ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. రాజకీయ దురుద్దేశాలతో తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీసేలా, శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వార తాళాలు ఓ ఛానెల్ రిపోర్టర్ చేతిలో ఉన్నట్లు ఓ వర్గం చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఏపీ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం క్లారిటీ ఇచ్చింది. చంద్రగ్రహణం సమయంలో శ్రీవారి ప్రధాన ఆలయ మహాద్వారాలు మూసివేశారని.. ఆ సమయంలో మహాద్వారానికి దూరంగా ఉండే కటకటాల ద్వారానికి వేసి ఉన్న గొలుసు, సాధారణ తాళం వేసి ఉన్న స్థితిలో.. పక్కన నిలబడి అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు ఫోటోలు తీయించుకున్నారని తెలిపింది. అయితే ఈ ఫోటోలను వైరల్ చేస్తూ.. శ్రీవారి మహాద్వారం తాళాలే వారి చేతిలో ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం తెలిపింది. ఇది అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడింది. మహాద్వారం తాళాలు వేరే వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే సమస్యే ఉత్పన్నం కాదని.. మహాద్వారమే కాదు, కటకటాల తాళాలు కూడా నిర్దేశిత అధికారుల వద్దే ఉన్నాయని క్లారిటీ ఇచ్చింది. ఏ ప్రైవేట్ వ్యక్తి చేతికి వెళ్లలేదని, వెళ్లే అవకాశం కూడా లేదని స్పష్టం చేసింది. రాజకీయ దురుద్దేశంతో తిరుమల శ్రీవారి ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రవర్తించే వారిపట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలను భక్తులు నమ్మవద్దని సూచించింది. మరోవైపు ఆదివారం సాయంత్రం 3 గంటల 30 నిమిషాల నుంచి సోమవారం తెల్లవారుజామున వరకూ మూసివేశారు. సోమవారం ఉదయం మూడు గంటలకు తలుపులు తెరిచి.. శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆరు గంటల నుంచి భక్తులను శ్రీవారి దర్శనం కోసం అనుమతించారు.