ఈ జిల్లాల్లో పిడుగులతో వానలు.. అధికారుల హెచ్చరిక

Wait 5 sec.

ఏపీవాసులకు బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లా, గోదావరి జిల్లాలు, ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లా , ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.*పిడుగులతో కూడిన వర్షాలు కురవనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఉరుములతో వర్షాలు పడే సమయంలో చెట్లకింద నిలబడరాదని ప్రజలకు సూచించింది. మరోవైపు ఆదివారం సాయంత్రం 5 గంటల నాటికి గుంటూరులో అత్యధికంగా 81 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. క్లౌడ్‌ బరస్ట్‌ తరహాలో వాన పడటంతో గుంటూరు వాసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. 25 నిమిషాల్లోనే 5 సెం.మీ. వర్షం కురవటంతో గుంటూరులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. *విజయవాడ, అమరావతి, సత్తెనపల్లిలోనూ భారీ వర్షం దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. స్థానికంగా ఉండే వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షానికి తోడు విద్యుత్ సరఫరా నిలిచిపోవటంలో పలుచోట్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని గుంటూరులోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టేవరకూ చెరువులు, నదులు, ప్రాజెక్టుల వైపు వెళ్లొద్దని అప్రమత్తం చేశారు. *మరోవైపు గుంటూరు తర్వాత పల్నాడు జిల్లా తుర్లపాడులో 54.5మిమీ, పెద్దకూరపాడులో 40.2మి మీ, గుంటూరు జిల్లా వంగిపురంలో 39.5మిమీ, కోనసీమ జిల్లా ముక్కములలో 39మిమీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరో నాలుగు రోజులు వర్షాలు కొనసాగనున్నట్లు వెల్లడించింది.