డొనాల్డ్ ట్రంప్ తాజా సుంకాల బెదిరింపులపై తీవ్రంగా స్పందించింది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోన్న చైనాపై నాటో దేశాలు 50 నుంచి 100 శాతం విధించాలన్న అమెరికా అధ్యక్షుడి ప్రతిపాదనలను తిప్పికొట్టింది. యుద్ధాలు సమన్యలను పరిష్కరించలేవని, ఆంక్షలు మరింత సంక్లిష్టం చేస్తాయని చైనా విదేశాంగ మంత్రి వాగ్‌ యీ స్పష్టం చేశారు. స్లొవేనియా విదేశాంగ మంత్రి టాంజా ఫజోన్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ‘చైనా యుద్ధాల్లో పాల్గొనదు.. అటువంటి ప్రణాళికల్లో భాగస్వామ్యం కాదు.. మేము చేసే పని శాంతి చర్చలు ప్రోత్సహించిడం, సంభాషణలు ద్వారా వివాదాస్పద సమస్యలకు రాజకీయ పరిష్కారం తీసుకురావడమే’ అని వాంగ్ యీ ఉద్ఘాటించారు. అంతేకాదు, బహుళపక్స వ్యవస్థలను బలోపేతం చేయాలని, ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని ఉద్దేశాలు, సూత్రాలను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతకాలంలో అంతర్జాతీయ పరిస్థితులు కల్లోలం, నిరంతర ఘర్షణలతో ముడిపడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.చైనా-ఐరోపా మధ్య ఉండాల్సింది స్నేహం, సహాకారం.. శత్రుత్వం, ప్రతిస్పందన కాదు. ఈ శతాబ్దంలోనే అతిపెద్ద మార్పుల నడుమ సరైన నిర్ణయాలు తీసుకోవడం అనేది చరిత్రకు, ప్రజలకు భుజాన వేసుకోవాల్సిన బాధ్యత’ అని వ్యాఖ్యానించారు. చైనాపై నాటో దేశాలు 50 శాతం నుంచి సుంకాలను 100 శాతానికి పెంచాలని ట్రంప్ ప్రతిపాదనలు చేసిన కొద్దిసేపటికే వాంగ్ యీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.‘చైనాపై 50 నుంచి 100 శాతం వరకు సుంకాలు విధించాలి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ముగిసిన తరువాత మాత్రమే వీటిని ఉపసంహరించాలి.. ఈ సుంకాలు చైనాకు రష్యాపై ఉన్న పట్టును సడలిస్తాయి’ అని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్ట్ పెట్టారు.కాగా, ఇటీవల చైనా వేదికంగా జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. రష్యా, చైనా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, షీ జింగ్‌పిన్‌లతో ఆయన భేటీ అయ్యారు. ఆ తర్వాత ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌‌తో పుతిన్, జిన్‌పింగ్ దిగిన ఫోటోలను ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేసి.. అమెరికాపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు, చైనా వల్లే రష్యా, భారత్‌లు తమకు దూరమయ్యాయని, బీజింగ్ మాయలో పడిపోవద్దంటూ తన అక్కసు వెళ్లగక్కారు. చైనా, భారత్‌లను దగ్గర చేశాయి. రష్యా నుంచి ఆయిలు కొనుగోలు చేస్తున్నారనే వంకతో భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ట్రంప్‌తో పాటు ఆయన యంత్రాంగం కూడా భారత్‌పై నోరుపారేసుకుని, తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.