ఏపీలో ఆటో డ్రైవర్లు ఒక్కొక్కరికి రూ.15వేలు.. ఎవరెవరికి ఇస్తారంటే!

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు తీపికబురు చెప్పారు.. దసరా రోజు వాహన మిత్ర కింది ఆర్థిక సాయం అందజేస్తాము అన్నారు. అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభలో ప్రకటన చేశారు. వాహనమిత్ర పథకం కింద అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రంలో 2.90 లక్షల మంది డ్రైవర్లకు లబ్ధి చేకూరుతుంది. మొత్తం రూ.435 కోట్ల ఆర్థిక సహాయం అందించనున్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే స్త్రీశక్తి పథకం ప్రారంభించిన సమయంలోనే ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.ఆటో డ్రైవర్లు అధైర్యపడొద్దని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఆయన చెప్పిన మాట ప్రకారం దసరా పండుగకు వాహనమిత్ర పథకం కింద డ్రైవర్లకు సహాయం అందించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం వాహనమిత్ర కింద రూ.10 వేలు మాత్రమే ఇవ్వగా.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రూ.15 వేలు ఇవ్వనుంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ సహాయం అందజేయనుంది. గత ప్రభుత్వ హయాంలో (2023-24లో) ఈ పథకం కింద 2.75 లక్షల మంది అర్హులున్నారు. అయితే ఈ 2.75 లక్షలమందిలో ఆటో డ్రైవర్లు 2.5 లక్షల మంది ఉంటే.. 25వేలమంది ట్యాక్సీ, మ్యాక్సీక్యాబ్‌ల డ్రైవర్లు ఉన్నారు. అయితే ఈ 2.75 లక్షలకు మరో 15 వేల వరకు పెరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు రవాణా శాఖ అధికారులు. అంటే ఈసారి 2.90 లక్షల మందికి సాయం అందుతుందని ఓ అంచనాకు వచ్చారు. ఈ పథకం సొంత వాహనం ఉండి.. దాన్ని నడిపే డ్రైవర్లకు వర్తిస్తుంది. ముఖ్యమంత్రి ప్రకటన చేయడంతో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు కీలక సమీక్ష నిర్వహించారు. ఆయన అమరావతిలోని సచివాలయంలో కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా, అదనపు కమిషనర్ రమాశ్రీ, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. 'రాష్ట్రంలో ఎన్ని ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీక్యాబ్‌లు ఉన్నాయి? వాటి యజమానుల్లో ఎంత మంది డ్రైవింగ్‌ చేస్తూ ఉపాధి పొందుతున్నారు?' అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు త్వరలోనే విడుదల చేస్తామని అప్పుడు లబ్ధిదారుల సంఖ్యపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15న స్త్రీ శక్తి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోంది. ఆ రోజు నుంచి ఆటో డ్రైవర్లు తాము ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. ఈ మేరకు తాజాగా ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున అందజేస్తామన్నారు.