ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. పంద్రాగస్టు సందర్భంగా ఆగస్ట్ 15వ తేదీ స్త్రీ శక్తి పథకాన్ని విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. స్త్రీ శక్తి పథకం ప్రారంభించి నేటికి నెల రోజులు పూర్తి కాగా.. స్త్రీ శక్తి పథకం సూపర్ హిట్ అయ్యిందని ప్రభుత్వం చెప్తోంది. పథకం అమల్లోకి వచ్చిన నెల రోజుల వ్యవధిలో ఎంత మంది మహిళలు స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం చేశారు.. ఎంతమేరకు వారికి లబ్ధి కలిగిందనే వివరాలను ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వివరించారు. నెల రోజుల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా 3.17 కోట్ల మంది మహిళలు, బాలికలు స్త్రీ శక్తి పథకాన్ని ఉపయోగించుకున్నట్లు మంత్రి తెలిపారు. స్త్రీ శక్తి పథకం అమలుతో రాష్ట్రంలోని మహిళలు ఒక్క నెలలోనే 118 కోట్ల రూపాయలు లబ్ధి పొందారని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వివరించారు.