రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు చేస్తోన్న ప్రయత్నాలు భారీ షాక్ తగిలింది. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు నిలిచిపోయినట్టు రష్యా శుక్రవారం సంచలన ప్రకటన చేసింది. మూడేళ్ల కొనసాగుతోన్న యుద్ధాన్ని ముగించేలా రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌ను ఒప్పించడానికి ట్రంప్ చేయని ప్రయత్నం లేదు. ఇటీవల అలాస్కాలో పుతిన్, ట్రంప్‌లు భేటీ అయ్యారు. కానీ, ఎటువంటి ఫలితం లేకపోయింది. మాస్కో భూ, వైమానిక దాడులతో కీవ్‌పై విరుచుకుపడుతోంది. రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మీడియాతో మాట్లాడుతూ... ‘ఛానెల్స్ ద్వారా ప్రతినిధులు సంభాషణలు జరిపే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి చర్చలు నిలిచిపోయాయని చెప్పడం ఉత్తమం’ అని అన్నారు. ‘గులాబీ రంగు కళ్లజోడు పెట్టుకుని చూస్తూ, చర్చల ప్రక్రియ వెంటనే ఫలితాలను ఇస్తుందని ఆశించలేం’ అని వ్యాఖ్యానించారు.సంఘర్షణను ముగించడానికి శిఖరాగ్ర సమావేశం అవసరమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ చెబుతుంటే.. ఆయనతో భేటీ కాబోమని పుతిన్ తిప్పికొట్టారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు తీవ్రతరం చేసింది. యుద్దం మొదలైన తర్వాత గతవారం తొలిసారి కీవ్‌పై మాస్కో అతిపెద్ద వైమానిక దాడి చేసింది. ఈ దాడుల్లో చాలా మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా.. కీవ్‌లో ప్రభుత్వ భవనం మంటల్లో చిక్కుకుంది. ఉక్రెయిన్-రష్యాల మధ్య ఇస్తాంబుల్ వేదికగా మూడు దఫాలుగా జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇరు దేశాల మధ్య యుద్ధ ఖైదీల అప్పగింత ఒక్కటే ఊరట కలిగించే అంశం.ఉక్రెయిన్ తన స్వాధీనంలో ఉన్న తూర్పు డాన్‌బాస్ ప్రాంతాన్ని వదిలేయడం సహా రష్యా భారీ డిమాండ్లు కొనసాగిస్తోంది. కీవ్ మాత్రం దీనిని తిరస్కరించింది. అంతేకాదు, ఐరోపా దళాలను ఉక్రెయిన్‌లో భూభాగంలో శాంతి భద్రత బలగాలుగా నియమించాలని కోరుతోంది. రష్యా దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఉక్రెయిన్‌పై 2022 ఫిబ్రవరిలో రష్యా దండయాత్ర ప్రారంభమైంది. అప్పటి నుంచి మూడున్నరేళ్లుగా ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో జరుగుతోన్న అతిపెద్ద సంఘర్షణ ఇదే కావడం గమనార్హం. యుద్ధం కారణంగా ఇరు దేశాలకు చెందిన 50 మూడు లక్షల మందికిపైగా సైనికులు ప్రాణాలు కోల్పోగా.. మిలియన్ మంది గాయపడ్డారు. ఒక్క రష్యా ఆర్మీలోనే 2.5 లక్షల మంది సైనికులు చనిపోగా.. 9.5 లక్షల మంది గాయపడ్డారని జూన్‌లో ఓ అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది. ఇరు దేశాలకు యుద్దంలో ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోంది. కానీ, యుద్ధాన్ని ముగించడానికి రష్యా మొండిగా వ్యవహరిస్తోంది. అమెరికా ఎన్నికల సమయంలో తాను అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లో ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగిస్తానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు పుతిన్ చుక్కలు చూపిస్తున్నారు.