ఏపీ నిత్యం ఏదో ఒక రీతిలో వార్తలు ఉండే పేరు. ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమరావతిలో ఐకానిక్ భవనాలు, అమరావతి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, అమరావతి స్పోర్ట్స్ సిటీ, అమరావతి క్వాంటం వ్యాలీ అంటూ రచిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి రీలాంఛింగ్ కార్యక్రమం కూడా నిర్వహించారు. రాజధాని నిర్మాణంలో భాగంగా వేల కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచి, పనులు కూడా ప్రారంభించారు. ముూడేళ్లలోగా అమరావతి తొలి దశ నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే ఇదే సమయంలో మరో ప్రశ్న ఉదయిస్తోంది..వైసీపీ వస్తే అమరావతి పరిస్థితి ఏమిటీ?నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించినప్పుడు.. విపక్షంలో ఉన్న వైసీపీ కూడా అంగీకరించింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే తమ ఉద్దేశమంటూ మూడు రాజధానుల వైఖరి తీసుకున్నారు. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్తూ వచ్చారు. దీంతో అమరావతి రైతులు భగ్గుమనడం.. వందల రోజుల పాటు అమరావతి రైతుల నిరసన దీక్షలు కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ మూడు రాజధానుల సిద్ధాంతం 2024 ఎన్నికల్లో పనిచేయలేదు. అమరావతి ప్రాంతంతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ వ్యతిరేక పవనాలు వీచాయి. దీంతో 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది.2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్..2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయారు. అమరావతి ప్రాంతంలో మాత్రమే వ్యతిరేకత వ్యక్తమవుతుందని ముందుగా అనుకున్న వైసీపీ పెద్దలకు.. ఈ ఫలితాలు పునరాలోచనలో పడేశాయి. విశాఖను రాజధానిగా చేస్తామని చెప్పినప్పటికీ.. ఆ ప్రాంతంలోనూ వైసీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. దీంతో వైసీపీ అధిష్టానం రాజధాని అంశంపై ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేదీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలోనే శుక్రవారం విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో వైసీపీ ముఖ్యనేత అమరావతిపై వైసీపీ వైఖరి గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.2024 ఎన్నికలకు ముందు విశాఖపట్నాన్ని ఏపీ పరిపాలన రాజధానిగా చేస్తారని.. రుషికొండ ప్యాలెస్ కూడా అందుకే నిర్మిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అలాగే ఉగాది తర్వాత విశాఖ నుంచి వైఎస్ జగన్ పరిపాలన సాగిస్తారంటూ వైసీపీ నేతలు కూడా పలుమార్లు చెప్పుకొచ్చారు. అయితే ఎన్నికల్లో ఓటమితో ఇవేవీ ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి పునర్వైభవం వచ్చింది. పనులు కూడా మొదలయ్యాయి.ఈ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే అమరావతి నుంచే పాలన సాగిస్తారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం విశేషం. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే సీఎంగా వైఎస్ జగన్ తాడేపల్లి నుంచే పాలన సాగిస్తారని..విశాఖకు వెళ్లరని సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. గుంటూరు విజయవాడ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని తెలిపారు. దీంతో రాజధాని విషయంలో వైసీపీ తన మూడు రాజధానుల సిద్ధాంతాన్ని వెనక్కి తీసుకుందా అనే చర్యలు మొదలయ్యాయి.