కన్జర్వేటివ్ కార్యకర్త, తన సన్నిహితుడు చార్లీ కిర్క్‌‌పై కాల్పులు జరిపిన అనుమానితుడ్ని అరెస్ట్ చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, చార్లీకి దగ్గరగా ఉన్న వ్యక్తి ఇచ్చిన సమాచారంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు నాకు సమాచారం ఉందని ఆయన చెప్పారు. ట్రంప్ ఫ్యాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘ఆ వ్యక్తి చట్ట సంస్థలతో సంబంధం ఉన్నవాడే.. కానీ, విశ్వాపాత్రుడు.. నిందితుడ్ని అమెరికా మార్షల్స్‌కు అప్పగించాడు... అతడ్ని పోలీస్ హెడ్‌‌క్వార్టర్స్‌కు తీసుకెళ్లారు.. ఎవరికోసమైతే వెతుకుతున్నామో అతడు ఇప్పుడు మన చేతిలోనే ఉన్నాడు’ అని తెలిపారు.బుధవారం యుటా వ్యాలీ యూనివర్సిటీలో విద్యార్థులు, మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తోన్న చార్లీ కిర్క్‌పై ఆగంతకుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. పట్టపగలే ఈ దారుణం చోటుచేసుకోగా.. వీడియోల్లో రికార్డయ్యింది. అమెరికాలో గన్ కల్చర్ గురించి అడుగుతోన్న ప్రశ్నలకు కిర్క్ సమాధానం ఇస్తున్న సమయంలో కాల్పులు జరపడం గమనార్హం. దుండుగుడు పేల్చిన బుల్లెట్ కిర్క్ మెడకు తగిలి, రక్తమోడుతోన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సమీపంలోని భవనంపై నుంచి నిందితుడు మౌసర్ 30-60 బోల్ట్ యాక్షన్ రైఫిల్‌తో ఒక్క రౌండ్ కాల్పులు జరిపినట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు. కాల్పులు జరిపిన ఆయుధాన్ని క్యాంపస్‌కు దగ్గరగా పార్క్ చేసిన కారు దగ్గర స్వాధీనం చేసుకున్నారు. విడుదల చేసిన దృశ్యాల్లో 20 లేదా 30 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తి కనిపించాడు. కాన్వర్స్ షూస్, నలుపు రంగు బేస్‌బాల్ క్యాప్, డార్క్ సన్‌గ్లాసెస్, అమెరికా జెండా ఉన్న లాంగ్‌స్లీవ్ షర్ట్ ధరించాడు. నిందితుడు వేగంగా ఓ భవనం పైకప్పుపై నుంచి కదులుతూ, ఆ తర్వాత నివాస ప్రాంతంలోకి వెళ్లి మాయమవుతున్న దృశ్యం అందులో ఉంది. నిందితుడ్ని పట్టుకోడానికి ఘటన తర్వాత 48 గంటల పాటు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇటీవల కాలంలో చేపట్టిన అతిపెద్ద కార్డన్ సెర్చ్ ఇదే కావడం గమనార్హం. ఇందులో 20కిపైగా ఏజెన్సీలు, వందల మంది అధికారులు, 7 వేల మందికిపైగా ప్రజల సహకారం తీసుకున్నారు.