‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’కి ప్యాకప్.. పవన్‌ కళ్యాణ్ ఇక బ్రేక్ తీసుకుంటారా?

Wait 5 sec.

ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎక్కడి సినిమాలు అక్కడ ఆగిపోయాయి. అయితే తన వల్ల నిర్మాతలు ఇబ్బంది పడకూడదని వీలు కుదిరినప్పుడల్లా డేట్స్ ఇస్తూ వచ్చారు. ఒక్కటొక్కటిగా సినిమాలు పూర్తి చేస్తూ ముందుకు సాగారు. ఇప్పటికే 'హరి హర వీరమల్లు' చిత్రాన్ని అభిమానులకు అందించారు. OG షూటింగ్ పూర్తి చేశారు. ఇక మిగిలింది 'ఉస్తాద్ భగత్ సింగ్' మాత్రమే. తాజాగా ఈ మూవీ షూటింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌'. ఇందులో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అప్పుడెప్పుడో 'భవదీయుడు భగత్ సింగ్' అనే పేరుతో సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా.. పవన్ పాలిటిక్స్, ఇతర కమిట్మెంట్స్ కారణంగా లేట్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకు పవన్ తిరిగి షూటింగ్ లో పాల్గొనడంతో జెట్ స్పీడ్ తో లాగించేశారు హరీష్. ఆదివారంతో పవన్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ మొత్తం కంప్లీట్ చేశారు. 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' మూవీలో పవన్ కళ్యాణ్ భాగం షూటింగ్ పూర్తయిందని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ''పవర్ స్టార్ షూటింగ్ పూర్తి చేసుకున్నారు. పవన్ - హరీష్ శంకర్ కాంబినేషన్ అనే సినీ ప్రియులకు ఎల్లప్పుడూ ఒక పండుగ.. అభిమానులకు ఒక కల్ట్ సెలబ్రేషన్. బిగ్ స్క్రీన్లలో మా 'ఉస్తాద్'ను అతని బెస్ట్ పర్ఫార్మన్స్ ను సెలబ్రేట్ చేసుకోడానికి సిద్ధంగా ఉండండి'' అని పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా లాస్ట్ డే పవన్ తో టీమంతా కలిసి సందడి చేసిన వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ తో పాటుగా హీరోయిన్ రాశీ ఖన్నా, డైరెక్టర్ హరీష్ శంకర్, మైత్రీ నిర్మాతలు, ఇతర కాస్ట్ అండ్ క్రూ కనిపిస్తున్నారు. థ్యాంక్స్ టు పవర్ స్టార్ అంటూ చిత్ర బృందం ధన్యవాదాలు తెలిపింది. సినిమా పట్ల పవన్ కళ్యాణ్ కి ఉన్న అంకితభావం, సపోర్ట్ కి థ్యాంక్యూ అని మేకర్స్ పేర్కొన్నారు. 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' సెట్స్ లో పవన్ కళ్యాణ్, రాశీ ఖన్నా సెల్ఫీ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇదివరకే OG సినిమాలో తన పార్ట్ షూట్ కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్'కి కూడా ప్యాకప్ చెప్పేశారు. దీంతో ఆయన కమిటైన సినిమాలన్నీ పూర్తయినట్లు అయింది. ఈ నేపథ్యంలో పవన్ సినిమాల నుంచి పూర్తిగా విరామం తీసుకుంటారా? అనే చర్చ మొదలైంది. ఇప్పటిదాకా అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో రెండు పడవల ప్రయాణం చేసిన ఉప ముఖ్యమంత్రి.. ఇకపై పూర్తిగా పాలిటిక్స్ కే పరిమితం అవుతారా? లేదా మళ్లీ కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఆయన ఫ్యాన్స్ మాత్రం పూర్తిగా సినిమాలకు దూరమవ్వకుండా, అప్పుడప్పుడు బిగ్ స్క్రీన్ మీద అలరించాలని కోరుకుంటున్నారు. మరి జనసేనాని సినిమాలకు గుడ్ బై చెప్తారా? లేదా మళ్లీ కెమెరా ముందుకు వచ్చి నటిస్తారా? అనేది వేచి చూడాలి.