తెలంగాణలో కురుస్తున్నాయి. జూన్ నెలలో సాధారణ వర్షపాతం నమోదు కాగా.. ఆ తర్వాత జూలై చివరి వారం, ఆగస్టు, సెప్టెంబర్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలు ప్రభావితమయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికల ప్రకారం.. రాష్ట్రానికి మరోసారి వర్షం హెచ్చరికలు జారీ అయ్యాయి. నేటి నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కొనసాగే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. నేడు కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.ఇక శనివారం కురిశాయి. ముఖ్యంగా ములుగు జిల్లాలోని వెంకటాపురంలో అత్యధికంగా 10.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి ఖమ్మం, ములుగు జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో చెరువులు, వాగులు పొంగిపొర్లాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలంలో వాగు దాటుతున్న ఇద్దరు మహిళా కూలీలు వరద ఉధృతికి కొట్టుకుపోయి మరణించారు. మృతులు ఏలూరు జిల్లాకు చెందిన పచ్చిశాల వరలక్ష్మి (52), పాలడుగుల చెన్నమ్మ (50) గా గుర్తించారు. హైదరాబాద్ నగరంలో శనివారం సాయంత్రం పలు ప్రాంతాల్లో వర్షం కురవగా.. రహదారులపై భారీగా వరద నీరు నిలిచింది. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద రావడంతో నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల గేట్లు తెరిచి నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 2.74 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో 26 గేట్లు ఎత్తి దిగువకు అదే మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 2.76 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా.. గేట్లు, విద్యుదుత్పత్తి, కాలువల ద్వారా 2.82 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు 1.57 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 1.63 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.