PMLA: రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్)‌కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రూ.2929 కోట్ల లోన్ మోసం కేసులో ఆ సంస్థ డైరెక్టర్‌గా ఉన్న అనిల్ అంబానీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసింది. ఇప్పుడు మరో కొత్త కేసు నమోదు చేసింది. ఆగస్టు నెలలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పలు బ్యాంకులకు అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ రూ.40 వేల కోట్లకు పైగా రుణ బకాయిలుపడింది. 2018 నాటి లెక్కల ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కటే రూ.2929 కోట్ల మేర నష్టపోయింది. 'నేరపూరిత కుట్రలో వారంతా పాలుపంచుకున్నారు. ఆర్ కామ్‌కు అనుకూలంగా లోన్స్ వచ్చేలా ఎస్‌బీఐని తప్పుదోవ పట్టించారు. లోన్ పొందిన తర్వాత వాటిని దుర్వినియోగం చేసేందుకు అవకతవకలకు పాల్పడ్డారు. రిలయన్స్ ఇన్ ఫ్రాటెల్ ద్వారా ఆర్ కామ్ బిల్లులను తక్కువ చూపారు, అమ్మకాల ఇన్‌వాయిస్ పై లోన్ దుర్వినియోగం జరిగింది. ' అని సీబీఐ అధికార ప్రతినిధి ఒకరు వివరాలు వెల్లడించారు. అందిన ఫిర్యాదు మేరకు రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సీబీఐ. ఈ కేసులో భాగంగా అనిల్ అంబానీ ఇంట్లో గత నెలలో సీబీఐ సోదాలు నిర్వహించింది. ముంబైలోని ఆర్ కామ్ ఆఫీసు, అనిల్ అంబానీ సీ విండ్ ఇంట్లో ఈ సోదాలు జరిగాయి. నేర పూరిత కుట్ర, మోసం, నమ్మక ద్రోహం వంటి నేరాలకు పాల్పడినట్లు అనిల్ అంబానీతో పాటు ఆర్ కామ్ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది. 4 శాతం మేర పడిన ఆర్‌కామ్ షేరు నమోదు చేసినట్లు తెలిసిన క్రమంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్) స్టాక్ భారీగా పడిపోయింది. ఇవాళ ఒక దశలో 4 శాతం మేర కుప్పకూలింది. ఆ తర్వాత కాస్త కోలుకుంది. అయితే మార్కెట్లు ముగిసే నాటికి 3.52 శాతం నష్టంతో రూ.1.37 వద్ద స్థిరపడింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.2.58, కనిష్ఠ ధర రూ.1.26గా ఉన్నాయి.