మెగా ఫ్యామిలీలోకి మరో వారసుడు వచ్చిన సంగతి తెలిసిందే. మెగా కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తనకు మనవడు పుట్టడంపై మెగాస్టార్ సంతోషం వ్యక్తం చేశారు. కొణిదెల ఫ్యామిలీలోకి చిన్నారికి స్వాగతం పలుకుతూ, తల్లిదండ్రులైన వరుణ్-లావణ్యకు అభినందనలు తెలిపారు. నాగబాబు-పద్మజలు నానమ్మ-తాతయ్యలుగా ప్రమోట్ అవ్వడం ఆనందంగా ఉందన్నారు. బిడ్డ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షింస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ''చిన్నారికి స్వాగతం. కొణిదెల కుటుంబంలో పుట్టిన నవజాత శిశువుకు హృదయపూర్వక స్వాగతం. తల్లిదండ్రులు అయినందుకు వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠికి నా అభినందనలు. నాగబాబు, పద్మజలు గ్రాండ్ పేరెంట్స్ గా ప్రమోట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ బిడ్డకు అన్ని రకాల ఆనందం, మంచి ఆరోగ్యం, అందరి ఆశీస్సులు సమృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మా బిడ్డను ఉండాలని ఆశిస్తున్నాను'' అని చిరంజీవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిన్నారితో దిగిన ఫొటోను షేర్ చేశారు. చిరంజీవి షేర్ చేసిన ఫోటోలో ఆయన ప్రేమగా తన మనవడిని ఎత్తుకొని కనిపిస్తున్నారు. పక్కనే ఉన్న వరుణ్ తేజ్ తన కుమారుడిని చూస్తూ సంబరపడిపోతున్నారు. చిరు ఆ బిడ్దవైపే చూస్తూ మురిసిపోతున్నారు. ‘బ్రహ్మా ఆనందం’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ లో చిరంజీవి తనకు వారసుడు కావాలనే తన మనసులోని కోరిక వెలిబుచ్చారు. ఇప్పుడు మెగాస్టార్ కళ్లలో ఆనందం చూస్తుంటే, కొణిదెల వారసుడు కావాలనే ఆయన కోరిక నెరవేరునట్లు ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.''ఇంట్లో ఉన్నప్పుడు నాకు మనవరాళ్లతో ఉన్నట్లు ఉండదు. ఓ లేడీస్‌ హాస్టల్‌ వార్డెన్‌లా ఉన్నట్లు ఉంటుంది. ఎందుకంటే నా చుట్టూ ఆడపిల్లలే ఉంటారు. అందుకే ఓ అబ్బాయిని కనమని చరణ్‌కు చెబుతుంటాను. మన వారసత్వం కొనసాగాలని అలా అంటుంటాను'' అని ‘బ్రహ్మా ఆనందం’ ఈవెంట్ లో సరదాగా అన్నారు చిరంజీవి. అయితే ఆయన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. ఆడపిల్లలను కించపరిచేలా చిరు మాట్లాడారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఆడపిల్లలు కూడా వారసులే అని నెటిజన్లు కౌంటర్ ఇచ్చారు. మెగా ఫ్యాన్స్ మాత్రం ఆయనకు మద్దతుగా నిలిచారు. కావాలని అలా మాట్లాడలేదని, మహిళలకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారనేది ఆయన చెల్లెళ్లని చూసుకునే విధానాన్ని బట్టే అర్థమైపోతుందని కామెంట్స్ చేశారు.