నేపాల్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మాజీ సీజేఐ.. ఎవరీ జస్టిస్ సుశీలా కర్కి?

Wait 5 sec.

జన్ జీ ఆందోళనలతో అల్లకల్లోంగా మారిన నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టారు. గత మూడు రోజులుగా కొనసాగుతోన్న ఆందోళనలు కాస్తా శాంతించాయి. జస్టిస్ సుశీలా కర్కీ నాయకత్వాన్ని ఆందోళనకారులు అంగీకరించారు. దీంతో నేపాల్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఆమె చర్యలు తీసుకోనున్నారు. జస్టిస్ సుశీల కర్కి.. నేపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన మొదటి మహిళ. 2016, ఫిబ్రవరిలో నేపాల్ సీజేఐగా ఆమె బాధ్యతలు చేపట్టారు. అవినీతి విషయంలో ఎలాంటి జాలి చూపించని, భయపడని న్యాయమూర్తిగా జస్టిస్ కర్కికి గుర్తింపు ఉంది. మహిళలు తమ పిల్లలకు పౌరసత్వం ఇవ్వగలరని అనుమతించే తీర్పులను కూడా ఆమె ఇచ్చారు. గతంలో నేపాల్‌లో కేవలం పురుషులకే ఈ హక్కు ఉండేది. ‘సమర్థులైన మహిళలు నాయకత్వ స్థానాల్లో ఉండాలి.. అప్పుడే మహిళా విమోచనం సాధ్యమవుతుంది’ అనేది ఆమె సిద్దాంతం. ఉపాధ్యాయురాలిగా కెరీర్ ప్రారంభించిన కర్కీ.. తర్వాత సుప్రీంకోర్టుకు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి స్థాయికి ఎదిగారు. రాజకీయ ప్రభావం లేదా వ్యక్తిగత సంబంధాలకు లోనుకుండా స్వతంత్రంగా తీర్పులు ఇవ్వడంలో ప్రసిద్ధి చెందారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వం ఎంపిక చేసిన పోలీసు చీఫ్ నియామకాన్ని సుప్రీం కోర్టు రద్దు చేసింది. దీంతో పక్షపాతం చూపడం, కార్యనిర్వాహక విభాగ పరిధిలో జోక్యం చేసుకున్నారనే ఆరోపిస్తూ 2017 ఏప్రిల్‌లో జస్టిస్ సుశీలా కర్కిపై పాలక పక్షం అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టింది. ఇక, సోషల్ మీడియాపై నిషేధం, అవినీతికి వ్యతిరేకంగా యువత చేపట్టిన జెన్-జెడ్ ఉద్యమం హింసాత్మకంగా మారింది. గత మూడు రోజులుగా నేపాల్‌లో జరుగుతోన్న ఆందోళనలు అదుపుతప్పి.. నాయకులు, అధికారులను టార్గెట్ చేసుకుని విధ్వంసానికి పాల్పడుతున్నారు.