తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ వృత్తి విద్యా కళాశాలలు నేటి నుంచి నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి. గత నాలుగేళ్లుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య వెల్లడించింది. దీనికి సంబంధించిన కీలక చర్చలు ఆదివారం అర్ధరాత్రి దాకా ప్రభుత్వ ప్రతినిధులతో జరిగాయి.సమాఖ్య సర్వసభ్య సమావేశం తరువాత ఈ బంద్‌కు పిలుపు ఇవ్వగా.. దీనిపై చర్చల కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు సీఎస్ రామకృష్ణారావు ప్రజాభవన్‌లో కళాశాలల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాత్రి 8:45 గంటలకు ప్రారంభమైన ఈ చర్చలు దాదాపు 12:30 గంటల వరకు కొనసాగాయి. చర్చల అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కళాశాలల సమస్యలను తాము అర్థం చేసుకున్నామని, సోమవారం దీనిపై ప్రభుత్వపరంగా ఒక నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే బంద్‌ను విరమించుకోవాలని కూడా వారిని కోరారు. అయితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగానే తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని సమాఖ్య ప్రతినిధులు స్పష్టం చేశారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి ఉప ముఖ్యమంత్రితో చర్చలు జరగనున్నాయి.కళాశాలల యాజమాన్యాల ప్రధాన డిమాండ్లుఇప్పటికే టోకెన్లు ఇచ్చిన రూ. 1,200 కోట్ల పెండింగ్ బిల్లులను దసరా లోపు చెల్లించాలి.గత నాలుగేళ్ల బకాయిలు మొత్తాన్ని డిసెంబర్ 31, 2025లోపు పూర్తి చేయాలి.బోధనా రుసుములను ఎప్పటికప్పుడు చెల్లించేందుకు 'ట్రస్ట్ బ్యాంక్' ఏర్పాటుపై సాధ్యసాధ్యాల నివేదికను (feasibility report) అక్టోబర్ 31, 2025లోపు విడుదల చేయాలి.ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్త ఫీజులకు సంబంధించిన జీవోను, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిబంధనలను డిసెంబర్ 31, 2025లోపు విడుదల చేయాలి.ఈ బంద్‌కు మద్దతుగా ఇంజినీరింగ్, ఫార్మా, బీఈడీ తదితర కళాశాలలు సోమవారం నుంచి నిరవధికంగా మూసివేయనున్నట్లు సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. కొన్ని కళాశాలలు ఇప్పటికే తమ విద్యార్థులకు సెలవుల సందేశాలను పంపగా.. మరికొన్ని ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తామని తెలిపాయి. కొన్ని ఈ నెల 17 వరకు, మరికొన్ని వారం రోజులపాటు తరగతులు ఉండవని పేర్కొన్నాయి. అయితే, మూడు ప్రముఖ కళాశాలలతో సహా మొత్తం నాలుగు ఇంజినీరింగ్ కళాశాలలు మాత్రం ఎలాంటి సెలవులను ప్రకటించలేదు. విద్యార్థులు, తల్లిదండ్రులు తమకు సహకరించాలని సమాఖ్య నాయకులు కోరారు.