దేశ ఉత్తర ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు వెనక్కి మళ్లినట్లు ఐఎండీ హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. కారణంగా తెలంగాణలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలకు, అలాగే ఇతర జిల్లాలకు కూడా వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు పడవచ్చునని చెప్పారు... గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. గత 24 గంటల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. గత రాత్రి హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ భారీ వర్షం కారణంగా పలుచోట్ల ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం సంభవించింది.గచ్చిబౌలిలోని వట్టినాగులపల్లిలో నిర్మాణంలో ఉన్న కన్వెన్షన్ సెంటర్ గోడ కూలి ఓ యువకుడు మరణించాడు. ఈ ఘటనలో మరో నలుగురు కూలీలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. నాంపల్లిలోని అఫ్జల్ సాగర్ నాలాలో 24 ఏళ్ల అర్జున్, 25 ఏళ్ల రామ్ గల్లంతయ్యారు. ముషీరాబాద్ వినోభా కాలనీలో నాలా గోడ కూలిపోవడంతో సన్నీ అనే యువకుడు గల్లంతయ్యాడు. ముషీరాబాద్ ఎంసీహెచ్ కాలనీ, బాపూజీ నగర్ ప్రాంతాలలో వరద ప్రవాహానికి వాహనాలు కొట్టుకుపోయాయి. కవాడిగూడ, జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 75 వంటి ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తట్టిఅన్నారంలో అత్యధికంగా 12.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ ముషీరాబాద్‌లో 12.1 సెం.మీ., ఓయూ (ఉస్మానియా యూనివర్సిటీ) 10.1 సెం.మీ., మెట్టుగూడ, మారేడ్‌పల్లి 9.5 సెం.మీ., షేక్‌పేట 9.4 సెం.మీ., కాప్రా 9.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అకాల వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.