తిరుమలలో పోలీసులు, టీటీడీ కలిసి మరోసారి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ నెలలో తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి.. ఈ క్రమంలో భద్రతను దృష్టిలో ఉంచుకుని తిరుమల నుంచి యాచకులు, అనధికార వ్యాపారులను తరలిచేందుకు టీటీడీ ముఖ్య నిఘా, భద్రతాధికారి (సీవీఎస్వో) మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు టీటీడీ విజిలెన్స్, హెల్త్ & శానిటేషన్, రంగంలోకి దిగారు. వీరంతా కలిసి సమన్వయంతో సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.తిరుమలలోని కళ్యాణకట్ట, ఎస్వీ షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంతాల్లో డ్రైవ్ చేపట్టి.. మొత్తం 82 మంది యాచకులు, అనధికార వ్యాపారులను గుర్తించి కిందకు పంపించారు. అంతేకాదు కొందరు అనుమానితుల వేలిముద్రలు కూడా పరిశీలించారు. తిరుమలలోని స్థానిక హోటళ్లు, టీ షాపులు, చిల్లర షాపుల యజమానులు.. కొండపై పని ముగించిన తర్వాత.. తమ దగ్గర పనిచేసే వారికి తగిన వసతిని తిరుపతిలో కల్పించాలని సూచించారు పోలీసులు. గత నెలలో కూడా ఇలాంటి డ్రైవ్‌ చేపట్టగా.. ఆ సమయంలో 75 మందిని తరలించారు. రాబోయే రోజుల్లో కూడా నిరంతరం ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.'సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేది వరకు నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంగరంగవైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలియజేశారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఛైర్మన్ తనిఖీ చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నాము. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన ప్రతి భక్తుడు వాహన సేవలను తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నాము. విద్యుత్ అలంకరణపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నాము. తిరుమలలో 35 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి వాహన సేవలను తిలకించేలా ఏర్పాట్లు చేస్తు్న్నాము' అని తెలిపారు.'తిరుమలలోని పలు ప్రాంతాల్లో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించిన ఆయన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. రోజు రోజుకూ మారుతున్న టెక్నాలజీని అనుసరించి నూతన సాఫ్ట్‌వేర్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని సూచించారు. తిరుమలలో మిస్సింగ్ పర్సన్స్ గుర్తించే ప్రక్రియ మరింత వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.తిరుమలలోని ప్రతి అంగుళాన్ని మానిటర్ చేయగల విధంగా సిబ్బందిని నియమించి కమాండ్ కంట్రోల్ సెంటర్ సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. రియల్ టైమ్‌లో వ్యక్తుల గుర్తింపు, ఘటనలపై నిఘా కోసం ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థను వినియోగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఈవో ఎల్&టీ సిబ్బందితో కూడా టెక్నాలజీ వినియోగంపై చర్చించారు'. 'అనంతరం ఈవో లగేజీ కౌంటర్‌ను పరిశీలించి భక్తులతో మాట్లాడారు. దర్శన టోకెన్ పొందిన సమయం, దర్శనం పూర్తైన సమయాలను వాకబు చేశారు. ఈ సందర్భంగా భక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ శ్రీవారి దర్శనం టీటీడీ సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 కు చేరుకుని భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం, మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతాలకు చెందిన శ్రీవారి సేవకులతో మాట్లాడారు. భక్తులకు శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీవారి సేవకులకు మరింత నాణ్యమైన శిక్షణ ఇచ్చి తద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సీపీఆర్వో డాక్టర్ టి.రవికి సూచించారు' అని టీటీడీ తెలిపింది.