రష్యా ఆయిల్ రిఫైనరీలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు.. భారత్‌కు లాభం, రిలయన్స్‌ పంట పండుతోంది!

Wait 5 sec.

సుదీర్ఘ కాలంగా సాగుతున్న కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తకుండా.. రష్యా చమురు కొనుగోళ్లపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ భారత్ మాత్రం రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు జరుపుతూనే ఉంది. దీనిపై గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి.. యుద్ధానికి భారత్ ఆర్థిక సహాయం చేస్తోందని ఆరోపిస్తున్నారు. దీనికి ప్రతిఫలంగా భారత్‌పై అదనపు సుంకాలు వేస్తున్నారు. అయితే తాము రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయకపోతే.. అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తలెత్తుతుందని స్పష్టం చేసిన భారత్.. తమ దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటామని తేల్చి చెప్పింది. అయితే ఇప్పుడు రష్యా ఆయిల్ రిఫైనరీలపై ఉక్రెయిన్ చేస్తున్న డ్రోన్ దాడులు కూడా.. భారత్‌కు భారీగానే లాభాలను తెచ్చిపెడుతున్నాయి. రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలే టార్గెట్‌గా ఉక్రెయిన్ గత కొంతకాలంగా డ్రోన్ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో రష్యా ఆయిల్ రిఫైనరీలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. దీన్ని అవకాశంగా మలుచుకున్న భారత్.. తక్కువ ధరకు రష్యా నుంచి ముడి చమురును భారీగా కొనుగోలు చేసి.. లాభాలను ఆర్జిస్తోంది. భారత్‌లోని రిఫైనరీ కంపెనీలు మరీ ముఖ్యంగా రిలయన్స్ కంపెనీ భారీ లాభాల్లో కొనసాగుతోంది. రష్యాలోని కీలక చమురు శుద్ధి కర్మాగారాలపై ఈ ఏడాది ఆగస్ట్‌లో ఉక్రెయిన్ అతిపెద్ద డ్రోన్ దాడులను చేపట్టింది. ఈ దాడుల కారణంగా రష్యా మొత్తం శుద్ధి సామర్థ్యంలో సుమారు 20 శాతం తగ్గింది. ఈ నిర్ణయంతో రష్యాలో అంతర్గతంగానూ ఇంధన కొరత తలెత్తుతోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు రష్యా.. తన ముడి చమురు ఎగుమతులను రోజుకు 2 లక్షల బ్యారెళ్లు పెంచింది.ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు కొనుగోలుదారుగా ఉన్న భారత్.. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుంది. రిలయన్స్, నయారా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వంటి భారత సంస్థలు.. రష్యా నుంచి భారీగా చమురు కొనుగోళ్లు చేస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ కంటే రష్యా చమురు బ్యారెల్‌కు 5 నుంచి 6 డాలర్లు తక్కువగా లభించడంతో భారతీయ రిఫైనరీ సంస్థలకు భారీ ఎత్తున లాభాలు ఆర్జిస్తున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం.. రిలయన్స్ సంస్థకు భారీగా లాభపడుతోంది. కేవలం రిలయన్స్ సంస్థ అదనంగా 500 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపుగా రూ.4500 కోట్ల వార్షిక ఆదాయాన్ని పొందవచ్చని అంచనా వేస్తున్నాయి. రిలయన్స్ సంస్థ పెట్రోల్, డీజిల్‌ను దేశంలో విక్రయించడమే కాకుండా.. ఐరోపా, సింగపుర్‌, ఆఫ్రికాలకు ఎగుమతి చేస్తోంది. రిలయన్స్ రిటైల్‌ విభాగం జియో-బీపీ కూడా రష్యా ఆయిల్‌తో భారీ లాభాలను గడిస్తోంది. గతేడాదితో పోలిస్తే జియో-బీపీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 34 శాతం, 39 శాతం పెరిగాయి. అయితే రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన అమెరికా.. అమెరికాకు ఎగుమతి చేసే భారతీయ వస్తువులపై 25 శాతం అదనపు సుంకాలు విధించడంతో మొత్తం సుంకాలు 50 శాతానికి చేరాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు భారత్ మద్దతునిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. అయితే.. రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో మాత్రం భారత్ మొదటి నుంచి ఒకే స్టాండ్‌పై ఉంది. భారత్ తన ఇంధన అవసరాలపై దేశ ప్రయోజనాలు, భరోసా, అందుబాటు ధర ఆధారంగా సార్వభౌమ నిర్ణయాలు తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల చైనా వేదికగా సమావేశమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేశారు. ఇక ఈ ఏడాది డిసెంబర్‌లో పుతిన్ భారత పర్యటనకు రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.