రాష్ట్రంలోని ఆక్వా రైతులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్ అందించాలని నిర్ణయించింది. ఏపీ ముఖ్యమంత్రి నారా నాయుడు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సచివాలయం వేదికగా జిల్లా కలెక్టర్ల సమావేశం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో చంద్రబాబు ఈ మేరకు అధికారులను ఆదేశించారు. సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగాన్ని అదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశం సందర్భంగా రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో ఆక్వా కల్చర్ సాగులో ఉందని అధికారులు చంద్రబాబుకు వివరించారు. రాయితీ విద్యుత్ సౌకర్యం అందించేందుకు ఆక్వాకల్చర్‌ను జోన్, నాన్ జోన్ కింద విభజించినట్లు తెలిపారు. అయితే రాయితీ విద్యుత్ కోసం ఆక్వా రైతులు ఇప్పటి వరకూ 30 శాతం మంది మాత్రమే నమోదు చేసుకున్నట్లు అధికారులు చంద్రబాబుకు వివరించారు.ఈ నేపథ్యంలో ఆక్వా రైతులు అందరూ రాయితీ విద్యుత్ కోసం నమోదు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. నెలరోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని.. ఆ లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న లబ్ధిదారులు అందరికీ రూ. 1.50కు యూనిట్ విద్యుత్ అందివ్వాలని చంద్రబాబు ఆదేశించారు. ఆక్వా ఉత్పత్తులకు ట్రేసబులిటీ, సర్టిఫికేషన్ కూడా చేయాలని సూచించారు. ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని వివరించారు, మరోవైపు కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులు యూరియా వాడకాన్ని తగ్గించేలా ప్రోత్సాహకం ప్రకటించారు. యూరియా వాడకాన్ని తగ్గిస్తే.. ప్రతి బస్తాకు రూ.800 చొప్పున నేరుగా రైతులకు అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. మరోవైపు పాడి పరిశ్రమ అనేది రైతులకు మంచి ఆదాయ మార్గంగా మారిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.దాణా ఉత్పత్తిని డ్వాక్రా గ్రూపులకు అనుసంధానం చేసే ఆలోచన పరిశీలించారని సూచించారు. అలాగే ఇల్లు లేని పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్మల స్థలం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో భూమి లభ్యత లేకుంటే గ్రూప్ హౌసింగ్ విధానం అనుసరించాలని సూచించారు. సెంట్ పట్టా తీసుకునేందుకు ఆసక్తి చూపకపోతే.. ఆ భూమిని పరిశ్రమలకు కేటాయించాలని సూచించారు. అలాగే వారికి కొత్త ఉచిత ఇళ్ల పట్టాల పథకంలో చోటు కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు.