తదుపరి ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే బలపరిచిన అభ్యర్థి ఎన్నికయ్యారు. ఇండియా కూటమి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిపై ఆయన 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొత్తం 781 ఓట్లకు గానూ.. 767 మంది సభ్యులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో బిజు జనతాదళ్, భారత రాష్ట్ర సమితి, అకాలీదళ్‌లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. మొత్తం 98.2 శాతం ఓటింగ్ నమోదైనట్టు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన రాజ్యసభ సెక్రెటరీ జనరల్ పీసీ మోదీ వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఓ పోస్టల్ బ్యాలెట్ ఓటు నమోదయ్యింది. అయితే, దీనిని పరిగణనలోకి తీసుకోలేదని ఆయన అన్నారు. అంతేకాదు, 15 ఓట్లు చెల్లనివిగా గుర్తించినట్టు తెలిపారు. రాజ్యసభలో 239 (6 ఖాళీలు), లోక్‌సభలో 542 (543కి గానూ ఒకటి ఖాళీ) కలిసి 781 ఓట్లు ఉండగా.. 12 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయని ఆర్వో తెలిపారు. సీపీ రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా.. ఇండియా కూటమి అభ్యర్ధి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్డీయే అభ్యర్థి 152 ఓట్ల తేడాతో విజయం సాధించినట్టు ప్రకటించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి లెక్కింపు ప్రారంభించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే అభ్యర్ధిని విజయం ఖరారైంది. ఇక, సీక్రెట్ బ్యాలెట్ తరహాలోనే ఓటింగ్ జరగడంతో ఎన్నికల్లో పార్టీలు జారీచేసే విప్ చెల్లుబాటు కాదని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎంపీలు ఆత్మప్రబోధానుసారమే ఓటు వేసే అవకాశం ఉండటంతో క్రాస్ ఓటింగ్ జరుగుతుందేమోనని భావించారు. కానీ, అలాంటిదేమీ జరగలేదు.ఇక, మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహరీ వాజ్‌పేయి అనుచరుడిగా గుర్తింపు పొందిన సీపీ రాధాకృష్ణన్‌ స్వస్థలం తమిళనాడు. ఆయన తొలిసారి 1998 పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులోని కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. తర్వాత 1999 ఎన్నికల్లో అదే సీటు నుంచి విజయం సాధించారు. పార్లమెంట్‌ టెక్స్‌టైల్స్ స్టాండింగ్ కమిటీసభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర గవర్నర్‌గా కొనసాగుతున్నారు. వచ్చే నవంబరులో బిహార్, 2026 ఏడాది మార్చి- ఏప్రిల్‌లో తమిళనాడు, బెంగాల్, త్రిపుర, కేరళ అసెంబ్లీలకు ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు తమ ఐక్యతను చాటుకోడానికే అభ్యర్థిని రంగంలోకి దింపాయి. అధికార ఎన్డీయే అభ్యర్థే విజయం సాధిస్తారని తెలిసినా.. బీజేపీ ఏకపక్ష వైఖరిని వ్యతిరేకించడమే తన ఉద్దేశమని, అందుకే రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించామని ఇండియా కూటమి పేర్కొంది.