నేపాల్‌లో దారుణం.. మాజీ ప్రధాని భార్య సజీవదహనం

Wait 5 sec.

నేపాల్‌ ఆందోళనల్లో అత్యంత అమానుష ఘటన చోటుచేసుకుంది. నేపాల్ మాజీ ప్రదాన మంత్రి ఝలనాథ్ ఖానాల్ నివాసానికి నిరసనకారులు నిప్పటించడంతో మంటల్లో చిక్కుకున్న ఆయన భార్య రాజ్యలక్ష్మి చిత్రాకర్ సజీవదహనమయ్యారు. రాజధాని కాఠ్మాండులోని దల్లు ప్రాంతంలో ఝాలనాద్ నివాసంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తీవ్ర గాయాలతో కీర్తిపూర్‌లోని ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు కుటుంబ వర్గాలు తెలిపాయి. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ వ్యక్తిగత నివాసాన్ని కూడా ఆందోళకారులు మంటల్లో తగులుబెట్టారు. సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వ నిషేధంతో రగిలిపోయిన నేపాల్‌ యువత చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. రెచ్చిపోయిన ఆందోళనకారులు అతి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఆ దేశ మంత్రులను వీధుల్లో ఉరికెత్తించి ఉరికెత్తించి దాడిచేస్తోన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కర్ఫ్యూను సైతం ఉల్లంఘిస్తూ.. పోలీసులు, సైన్యంతో ఘర్షణకు దిగుతున్న వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. నేపాల్ ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్‌ పౌడేల్‌ (65)పై ఆందోళనకారులు దాడికి దిగారు. ఆందోళనకారుల నుంచి తప్పించుకోడానికి వీధుల్లో పరిగెత్తుతోన్న ఆయనను ఎదురుగా వచ్చిన ఒక యువకుడు ఎగిరితన్నాడు. దాంతో పట్టుకోల్పోయి పక్కనే ఉన్న ఓ గోడపై ఆయన పడిపోయారు. కానీ వెనుక నుంచి తరుముకొస్తున్న వందల మంది నిరసనకారుల నుంచి తప్పించుకుని, తన ప్రాణాలు కాపాడుకోడానికి ఆయన వెంటనే లేచి పరుగెత్తారు. అత్యంత భయానక దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదే సమయంలో, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా, ఆయన సతీమణి, ప్రస్తుత విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవుబాను ఆందోళనకారులు వదల్లేదు. వారిపైకూడా దాడి చేసి, కొట్టారు.మరోవైపు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని సోషల్ మీడియాలో ఆందోళనకారులు పిలుపునివ్వడంతో పరిస్థితి మరింత అదుపుతప్పే ప్రమాదం ఉంది. ఇప్పటికే నాయకుల ఇళ్లతో పాటు పార్లమెంట్‌, సుప్రీంకోర్టుకు ఆందోళనకారులు నిప్పంటించారు. అయితే, ప్రజా, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసాన్ని విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వాటిని కాపాడుకునేందుకు అవి రంగంలోకి దిగాయి. ఈ ఆందోలనల్లో మంగళవారం మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఈ సంఖ్య 22కు చేరుకుంది. ఇక, ఢిల్లీ-కాఠ్మాండూ మధ్య విమానాలను ఎయిరిండియా రద్దు చేసింది.