బుద్వేల్ వద్ద ORRకు అనుసంధానంగా ఇంటర్‌ఛేంజ్.. పనులు ప్రారంభించిన సీఎం రేవంత్

Wait 5 sec.

హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజేంద్రనగర్ సమీపంలోని అనుసంధానంగా నిర్మించనున్న రేడియల్ రోడ్-2 ఇంటర్‌ఛేంజ్ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం (మార్చి 6) శంకుస్థాపన చేశారు. గతంలో ఈ ప్రాంతంలో పూర్తిస్థాయి ఇంటర్‌ఛేంజ్‌లు లేకపోవడంతో.. స్థానికులు, ఐటీ ఉద్యోగులు కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి వచ్చేది. గచ్చిబౌలి, రాజేంద్రనగర్ ఎగ్జిట్‌ల వద్ద మలుపు తీసుకునేవారు. ఈ కొత్త ప్రాజెక్టుతో ఆ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఇక మారుతున్న కాలానికి అనుగుణంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి ప్రణాళికల్లో నిర్వాసితులు ఎవరికీ నష్టం జరగకుండా అందరినీ ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 'మూసీనది పూర్తిగా మురికితో నిండిపోయింది. కానీ ఇప్పుడు కాలం మారింది. భవిష్యత్తు మారుతోంది. అందుకు అనుగుణంగా మహానగరానికి ప్రణాళికలు మార్చుకోవాలి. ప్రజలు ఎవరూ మురికిలో బతకాలను కోరుకోరు. విధిలేక మురికికూపాల్లో నివసిస్తున్నారు. ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావాలి. పేదల గురించి ఆలోచించి అందరినీ మెప్పించి, ఒప్పించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఈ అభివృద్ధిలో ఇక్కడి వారందరినీ భాగస్వామ్యం చేస్తాం. ఎక్కడ ఉన్న వాళ్లకు అక్కడే ఇండ్లు కట్టించడానికి ఏర్పాటు చేస్తాం. రీజినల్ రింగ్ రోడ్డు కట్టాలన్నా, రేడియల్ రోడ్లు వేయాలన్నా, బుల్లెట్ ట్రైన్ నిర్మించాలన్నా, ఎవరిదో ఒకరిది భూమి కోల్పోవాల్సిన పరిస్థితి. భూమి కోల్పోయిన దుఖం ఉంటది. కానీ వేరే దగ్గర భూమి కొనుక్కునేంతగా నష్టపరిహారం ఇచ్చే బాధ్యత నాది.అహ్మదాబాద్‌లో సబర్మతీ నది రివర్ ఫ్రంట్, ఢిల్లీలో యమునా రివర్‌ఫ్రంట్, ఉత్తరప్రదేశ్‌లో గంగానది రివర్ ఫ్రంట్ ఎలాగైతే అభివృద్ధి చేశారో, హైదరాబాద్‌లో మూసీనది రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసుకుంటున్నాం. దీని చుట్టూ రాత్రి పూట వ్యాపారాలు చేసుకునే ఏర్పాట్లు చేస్తాం. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. శాంతిభద్రతలను పటిష్టం చేస్తాం. నైట్ టూరిజంకు శ్రీకారం చుడుతున్నాం. ఈ ప్రాజెక్టులో భూములు కోల్పోయే వారికి ఆయా నియోజకవర్గాల్లోనే ప్రభుత్వ స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తాం. గొప్ప గొప్ప చారిత్రక కట్టడాలతో ప్రపంచంలోనే అందమైన నగరంగా హైదరాబాద్ విలసిల్లింది. అలాంటి హైదరాబాద్ మహా నగరం చెత్త చెదారంతో నిండిపోయిందన్న వరకు తెచ్చారు. ఇప్పుడు హైదరాబాద్‌ను తిరిగి అద్భుతంగా తీర్చిదిద్దాలనుకుంటే కొందరు అడ్డుకుంటున్నారు. ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దుతాం. శంషాబాద్ ప్రాంతం బుల్లెట్ ట్రెయిన్ హబ్‌గా మారనుంది. బెంగళూరు, అమరావతి, చెన్నైలకు ఇక్కడి నుంచే బుల్లెట్ ట్రెయిన్ సౌకర్యాలు రాబోతున్నాయి. దాదాపు అన్ని అనుమతులు వచ్చాయి. ట్రంప్, ఎలాన్ మస్క్ లకు సంబంధించిన సంస్థలు ఇక్కడికి రాబోతున్నాయి. ప్రపంచంలోనే గొప్ప నగరాన్ని ఇక్కడ నిర్మిస్తున్నాం. ఇది ప్రారంభమే. ప్రపంచంతోటి పోటీ పడే అభివృద్ధి ఇక్కడ జరుగుతుంది' అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాగా, అంతకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎకో హిల్ పార్క్‌ను సందర్శించడంతో పాటు బర్డ్స్ ఏవియరీని ప్రారంభించారు.