బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీలోని ఈ జిల్లాల్లో రెండు రోజుల పాటూ వర్షాలు

Wait 5 sec.

ఏపీ ప్రజలకు ముఖ్యమైన గమనిక.. రాష్ట్రంలో వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 'ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో శనివారం, ఆదివారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది' అని తెలిపింది. ఓవైపు ఎండల తీవ్రత కొనసాగుతున్న వేళ ఇప్పుడు వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది.ఏపీలో ఎండ తీవ్రత కొనసాగుతోంది.. దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో వేడిగాలులు వీచాయి. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయి. సాధారణం కంటే 4 నుంచి 7 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లా కావలిలో ఏకంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. ప్రస్తుతానికి ఈ సీజన్‌లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. ప్రకాశం జిల్లా ఒంగోలులో 39.8, నెల్లూరులో 39.6, కర్నూలుల్లో 39.6, అమరావతిలో 39.4.. తిరుపతి, కడప, నంద్యాలలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రెండు రోజులు వేడి వాతావరణం కొనసాగుతుందని తెలిపారు. ఓ వైపు ఎండలు, వేడిగాలుల తీవ్రత అలా ఉంటే.. విచిత్రంగా ఉత్తర కోస్తాలో పలుచోట్ల ఉదయం వేళలో పొగమంచు కురిసింది.కృష్ణాజిల్లా గన్నవరంలోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను పొగమంచు కమ్మేసింది. శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే శుక్రవారం ఉదయం చేరుకోవాల్సిన విమాన సర్వీసులు ఆలస్యం అయ్యాయి. ఈ క్రమంలో విజిబులిటీ సమస్యతో చెన్నై, హైదరాబాద్‌, ఢిల్లీ విమాన సర్వీసులు గాలిలో చక్కర్లు కొట్టాయి.. ఆ తర్వాత ల్యాండ్ అయ్యాయి. అంతేకాదు పొగమంచు దెబ్బకు గన్నవరం సమీపంలో పొగమంచు కమ్మేయడతో జాతీయ రహదారిపై వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఉదయం పొగమంచు.. ఆ తర్వాత ఎండ దెబ్బకు జనాలు ఇబ్బందిపడుతున్నారు. ఉదయం 9 గంటల వరకు పొగమంచు తీవ్రత.. ఆ తర్వాత ఎండల తీవ్రత కొనసాగుతోంది.