Children missing cases in kamareddy: కామారెడ్డిలో చిన్నారులు కనిపించకుండా పోవటం కలకలం రేపుతోంది. శుక్రవారం రోజున ఇద్దరు చిన్నారులు కనిపించకుండా పోగా.. శనివారం ఉదయం నుంచి మరో ముగ్గురు చిన్నారులు కనిపించకుండా పోయారు. మొత్తంగా రెండు రోజుల వ్యవధిలో ఐదుగురు చిన్నారులు కనిపించకుండా పోవటం.. అదృశ్యమైన పిల్లలు అందరూ పదేళ్లలోపు వారు కావటం తీవ్ర కలకలం రేపుతోంది. కామారెడ్డిలోని గోసంగి కాలనీకి చెందిన పదేళ్ల సింహాద్రి. తొమ్మిదేళ్ల విజయ్ అనే ఇద్దరు చిన్నారులు శుక్రవారం అదృశ్యమయ్యారు. ఇక శనివారం ఉదయం కామారెడ్డిలోని ఆర్‌బీనగర్‌ కాలనీకి చెందినసీపాత్‌ (8), ఆయాత్‌ (7), మరియం (5) అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు కనిపించకుండా పోయారు.శనివారం ఉదయం తండ్రితో కలిసి ఆటోలో బయల్దేరి వెళ్లారు ముగ్గురు చిన్నారులు. పిల్లలను షాపు వద్ద దింపేసిన వారి తండ్రి.. ఆటో కిరాయికి వెళ్లిపోయారు. అయితే ఆ తర్వాతి నుంచి వారు కనిపించడం లేదంటూ చిన్నారుల తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తంగా రెండు రోజుల వ్యవధిలో ఐదుగురు పిల్లలు అదృశ్యం కావటంతో పిల్లల తల్లిండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. పిల్లల అదృశ్యంపై కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చిన్నారుల ఆచూకీని కనిపెట్టే పనిలో ఉన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి, కామారెడ్డి సీఐ నరహరి, కామారెడ్డి రూరల్ సీఐ రామన్ నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ మూడు బృందాలు చిన్నారుల ఆచూకీని కనిపెట్టే పనిలో ఉన్నాయి. మరోవైపు కనిపించకుండా పోయిన చిన్నారుల ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. అయితే రెండు రోజుల వ్యవధిలో ఐదుగురు పిల్లలు కనిపించకుండా పోయారనే వార్త కామారెడ్డిలో తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికులు, పిల్లల తల్లిదండ్రులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా పిల్లల ఆచూకీని కనిపెట్టాలని కోరుతున్నారు. పిల్లల ఆచూకీ తెలిసినప్పుడే ప్రశాంతంగా ఉండగలమని చెప్తున్నారు.