‘చాలా బాధగా ఉంది’.. విడాకుల వ్యవహారంపై స్పందించిన దళపతి విజయ్‌..

Wait 5 sec.

కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే అధ్యక్షుడు దళపతి విజయ్‌ విడాకుల వ్యవహారం గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఆయన భార్య సంగీత విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించడంపై తమిళనాట పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు తనపై వస్తున్న వివాదాలపై విజయ్ పరోక్షంగా స్పందించారు. తన వ్యక్తిగత విషయాల వల్ల తన అభిమానులు, ప్రజలు ఇబ్బంది పడుతుంటే బాధగా ఉందని అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం టీవీకే ఆధ్వర్యంలో చెన్నై సమీపంలోని చెంగల్పట్టు వద్ద ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి పార్టీ అధ్యక్షుడు విజయ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యక్తిగత వివాదాల గురించి తాను చూసుకుంటానని అన్నారు. పార్టీ కార్యకర్తలంతా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహిళలకు ప్రత్యేక వరాలు ప్రకటిస్తూ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు.''ఇటీవల నన్ను చుట్టుముట్టిన సమస్యలు, ఇబ్బందుల గురించి మీరు చింతించకండి. ఆ సమస్యలు మీ సమయం కంటే విలువైనవి కావు. వాటిని నేను చూసుకుంటాను. మీరు చేయాల్సిందల్లా ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే. నా సమస్యల కారణంగా మీరు విచారంగా ఉండటం, మిమ్మల్ని ఒత్తిడికి గురవుతున్నట్లు చూడటం నాకు చాలా బాధ కలిగిస్తుంది. నా వ్యక్తిగత విషయాలను ఎలా పరిష్కరించుకోవాలనేది నాకు బాగా తెలుసు వాటి సంగతి నేను తర్వాత చూస్తా" అని విజయ్ అన్నారు. విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ ఆయన భార్య సంగీత విడాకుల కోసం కోర్టులో పిటిషన్‌ వేశారు. 2021లో విజయ్ ఆ నటితో సంబంధం పెట్టుకున్నాడని తనకు తెలిసిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ సంబంధం ముగుస్తుందని ఆయన హామీ ఇచ్చినప్పటికీ, దాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారని, దానిపై ఆయన ఎటువంటి విచారం వ్యక్తం చేయలేదని తెలిపింది. భార్యాభర్తల బంధానికి విజయ్‌ ద్రోహం చేశారని, గత కొన్నేళ్లుగా మానసిక క్షోభ అనుభవిస్తున్నానని, విజయ్ నుంచి విడాకులు ఇప్పించమని ఆమె న్యాయస్థానాన్ని కోరారు. ఏప్రిల్‌ 20న దీనిపై విచారణ జరగనుంది. అదే రోజు విజయ్‌ కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది.అయితే సంగీత తాజాగా కోర్టులో అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. విడాకుల కేసు ముగిసే వరకు చెన్నైలోని విజయ్ ఇంట్లో ఉండేందుకు తనకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నీలంగరై ఇంట్లో ఉండేందుకు అనుమతి కోరితే తన లాయర్ ద్వారా విజయ్ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు.