'దుర్యోధనుడికి కర్ణుడి లాగా.. మాదిగలకు నేను నిలబడ్డాను'.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Wait 5 sec.

తెలంగాణ మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన ధన్యవాద సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి .. కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించడంపై సీఎం రేవంత్ రెడ్డికి మాదిగ సామాజికవర్గ ఉద్యోగులు (మాదిగ ఎంప్లాయిస్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ) ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు ఎన్నో పోరాటాలు చేశారని కొనియాడారు. ఈ ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మహాభారత కథను గుర్తు చేశారు. తనకు మహాభారతంలో కర్ణుడు, బర్బరీకుడు అంటే చాలా ఇష్టమని తెలిపిన రేవంత్ రెడ్డి.. మిత్రుడి కోసం తన కొన ఊపిరి వరకు కర్ణుడు నిలబడ్డాడని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాను కూడా మిత్రధర్మానికి కట్టుబడి మాదిగల వెంట నిలబడినట్లు రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. కర్ణుడి లాగా తాను మాదిగల విషయంలో మిత్రధర్మం పాటిస్తున్నట్లు తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని పేర్కొన్నారు. తాను ఎన్నో ఏళ్లుగా స్వయంగా ఎస్సీ వర్గీకరణ సమస్యను కళ్లారా చూసి వచ్చినట్లు తెలిపారు. వర్గీకరణపై తాను మొదటినుంచీ అనుకూలంగా ఉన్నట్లు తెలిపిన రేవంత్ రెడ్డి.. గతంలో తాను అసెంబ్లీలో పోరాటం చేసినందుకు తనను బయటికి పంపించేశారని తెలిపారు. తనపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తాను మాదిగల వైపే నిలబడినట్లు సీఎం రేవంత్ చెప్పారు. తనతో పాటు చాలా మంది ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసినట్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణ ప్రకటన చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని తెలిపిన ముఖ్యమంత్రి.. ఎస్సీ వర్గీకరణ అంశంలో మాదిగల వైపు న్యాయం ఉందని తెలిపారు. అందుకే తాను చివరి వరకు మాదిగల వైపు నిలబడినట్లు వెల్లడించారు. మహాభారతంలో బర్బరీకుడు బలహీన పక్షాల వైపు నిలబడ్డాడని.. అందుకే ఎస్సీ వర్గీకరణలో మాదిగల కోసం బర్బరీకుడిలా తాను పనిచేసినట్లు రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నామని.. ప్రగతి ప్రణాళికలో ఉద్యోగులంతా చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయన్న రేవంత్ రెడ్డి.. పంచడానికి ప్రభుత్వం వద్ద భూములు లేవని.. అంతంతమాత్రంగానే ఆర్థిక వెసులుబాటు ఉందని పేర్కొన్నారు. అయినప్పటికీ.. మాదిగలకు నాణ్యమైన విద్య, రాజకీయ అవకాశాలు కల్పించే బాధ్యత తనది అని హామీ ఇచ్చారు.