ఏపీ ప్రభుత్వ విప్, టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తన తండ్రి తంగిరాల ప్రభాకరరావు స్ఫూర్తితో లా చదువుతున్నారు. గుంటూరులోని జేసీ లా కాలేజీలో సౌమ్య ఎల్‌ఎల్‌బీ ఫస్టియర్ లా పరీక్షలు రాస్తున్నారు. సౌమ్య గతేడాది లా సెట్ పరీక్ష రాశఆరు.. ఆమెకు గుంటూరు జేసీ లా కాలేజీలో మూడేళ్ల లా కోర్సులో సీటు వచ్చింది. ప్రస్తుతం ఫస్టియర్ పరీక్షలు జరుగుతున్నాయి. సౌమ్య తండ్రి, మాజీ ఎమ్మెల్యే దివంగత తంగిరాల ప్రభాకరరావు లాయర్‌గా సేవలందించిన సంగతి తెలిసిందే. ఆయన స్ఫూర్తితో సౌమ్య కూడా ఎల్‌ఎల్‌బీ చదువుతున్నారు. గతేడాది నిర్వహించిన లాసెట్‌లో తంగిరాల సౌమ్య మంచి ర్యాంక్ సాధించారు. 120 మార్కులకు 95 మార్కులు రాగా.. 739వ ర్యాంకు వచ్చింది. తండ్రి తంగిరాల ప్రభాకరరావు కూడా లాయర్‌గా ఎంతోమందికి సేవలు అందించారు. సౌమ్య కూడా తండ్రిని ఆదర్శంగా తీసుకుని లా చదవాలని నిర్ణయించుకున్నారు. ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నా సరే ఇటు చదువుపై కూడా ఫోకస్ పెట్టారు. సౌమ్య అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చారు.. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు లా కూడా చదివి చట్టాలపై అవగాహన పెంచుకోవచ్చంటున్నారు. బీటెక్ చదివి ఐటీ ఉద్యోగం కూడా చేశారు. ఆమె తండ్రి తంగిరాల ప్రభాకరరావు 2009లో టీడీపీ నుంచి నందిగామలో పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగి గెలిచారు.. అయితే కొంతకాలానికి ప్రభాకరరావు అనారోగ్య కారణాలతో చనిపోయారు. ఈ క్రమంలో సౌమ్య తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 2014లో నందిగామలో ఉపఎన్నిక జరగ్గా.. సౌమ్య టీడీపీ నుంచి పోటీచేసి విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అంతేకాదు నందిగామ నుంచి తొలి మహిళా ఎమ్మెల్యేగా గుర్తింపుపొందారు. 2019 ఎన్నికల్లో సౌమ్య వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మొండితోక జగన్‌మోహన్‌రావు చేతిలో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో మళ్లీ నందిగామ నుంచి పోటీచేసి గెలిచి రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అంతేకాదు ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్‌ పదవిలో ఉన్నారు.