అడవుల విస్తీర్ణం ఏటేటా తగ్గిపోతోంది. దీంతో అటవీ జంతువులు ఆహారం కోసం, తాగు నీటి కోసం సమీప గ్రామాల్లోకి వస్తున్న ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో చిత్తూరు జిల్లాతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ఏనుగు పదే పదే సమీప గ్రామాల్లోకి వచ్చి పంటలను ధ్వంసం చేయడం చూస్తేనే ఉన్నాం. ఏపీని ఆనుకొని ఉండే ఒడిశాలోనే ఏనుగుల బెడద ఎక్కువే. రాత్రి సమయంలో అడవి నుంచి బయటకొచ్చే ఏనుగులు సమీప గ్రామాలపై దండెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రమాదాల బారిన కూడా పడుతున్నాయి.తాజాగా ఒడిశాలోని కియోంఝార్ పరిధిలో ఓ ఏనుగు పాత రాతి బావిలో పడిపోయింది. సదర్ రేంజ్‌లోని బెనయోడి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 25 ఏళ్ల వయసున్న ఒంటరి ఏనుగు ఆహారం వెతుక్కుంటూ బుధవారం రాత్రి నరహరి నాయక్ అనే వ్యక్తి తోటలోకి ప్రవేశించింది. వీధి కుక్కలు మొరగడంతో భయపడిన ఏనుగు.. వాటి బారి నుంచి తప్పించుకునే క్రమంలో 30 అడుగుల లోతైన బావిలో పడిపోయింది. పెద్దగా శబ్దం రావడంతో నరహరి కుటుంబ సభ్యులు.. ఏనుగు బావిలో పడిపోయినట్లు గుర్తించారు.వెంటనే అప్రమత్తమైన గ్రామస్థులు అటవీ శాఖకు సమాచారం అందించారు. అటవీ సిబ్బంది కూడా అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది దాన్ని కాపాడారు. అయితే ఇందుకోసం వారు ఆర్కిమెడిస్ సూత్రాన్ని ఉపయోగించారు. భారీగా బరువు ఉండే ఏనుగును తాళ్లతో పైకి లాగడం కష్టంతో కూడుకున్న పని. అందుకే అటవీ సిబ్బంది ఫిజిక్స్ సూత్రాన్ని ఉపయోగించారు. బావిలోకి వేగంగా నీటిని నింపారు. దీంతో అది పైకి తేలింది. ఏనుగు పడిన బావిలోకి వేగంగా నీటిని నింపాలి. ఆర్కిమెడిస్ సూత్రం ప్రకారం.. ఏదైనా వస్తువు ద్రవంలో పూర్తిగా లేదా పాక్షికంగా మునిగితే.. ఆ వస్తువు కొంత ద్రవాన్ని పక్కకు నెడుతుంది. వస్తువు పక్కకు నెట్టిన ద్రవం బరువుకు సమానమైన పరిమాణంలో బలం.. దాన్ని పైకి నెడుతుంది. దీని వల్ల ఆ వస్తువు ద్రవంలో తేలే అవకాశం ఉంది. బావిలో నీటి మట్టం పెరిగే కొద్దీ.. నీటిలో ఏనుగు బరువు తగ్గుతుంది. దీని వల్ల ఏనుగు నీటిపై తేలుతుంది. అలా నీటిని నింపిన తర్వాత.. ఏనుగు బయటకు రావడానికి వీలుగా బావి వద్ద జేసీబీతో తవ్వి, ర్యాంప్‌లా ఏర్పాటు చేసి.. ఏనుగును సురక్షితంగా బయటకు తెచ్చారు. అయితే ఇందుకోసం అటవీ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది 6 గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది.గతంలోనూ అటవీ సిబ్బంది బావుల్లో పడిన ఏనుగులను బయటకు తీసుకొచ్చేందుకు ఆర్కిమెడిస్ సూత్రాన్ని ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. ఏనుగు గుంతలో లేదా బావిలో పడినప్పుడు జేసీబీతో మట్టిని మొత్తం తోడటం కంటే.. నీటిని నింపడం ద్వారా తీసుకొని రావడం తేలికైన ప్రక్రియ.