కేరళంలోని తిరువనంతపురానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి భయంకరమైన అనుభవం ఎదురైంది. ఒక్క క్షణం అతడి గుండె అగినంత పనైంది. బెడ్ రూం ఏసీలో ఐదు పాములు ప్రత్యక్షం కావటంతో అతడు వణికిపోయాడు. నగరంలోని శ్రీకార్యం ప్రాంతంలో నివసించే మాధవ్ జె పణిక్కర్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బుధవారం సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. బయట ఎండకు తిరగటం, ఉక్కపోతగా ఉండటంతో తన బెడ్‌రూంలోని ఏసీ ఆన్ చేసేందుకు రిమోట్ తీసుకున్నాడు. అయితే అంతలోనే ఏసీ నుంచి ఏదో వింత శబ్దం రావడాన్ని అతడు గమనించారు.దగ్గరకు వెళ్లి తీక్షణంగా పరిశీలించగా.. ఏసీ యూనిట్ కింద ఒక తోక వంటి భాగం కనిపించింది. అది చూసిన వెంటనే అతడి గుండె ఆగినంత పనైంది. టార్చ్ లైట్ వేసి చూడగా.. లోపల పాము కదలికలు కనిపించాయి. ఆ సమయంలో ఇంట్లో మాధవ్‌తో పాటు ఆయన తల్లిదండ్రులు, తమ్ముడు కూడా ఉన్నారు. వెంటనే 'సర్పా' యాప్ సాయంతో అటవీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. యాప్ వాలంటీర్, పాములు పట్టడంలో అనుభవజ్ఞుడైన గౌతమ్ మురళి ఘటనా స్థలానికి చేరుకున్నారు. టార్చ్ లైట్ సాయంతో ఏసీని పరిశీలించి అవి విషరహితమైన 'బ్రాంజ్‌బ్యాక్' పాములుగా గుర్తించారు. ఆ తర్వాత ఏసీ మెకానిక్‌ను పిలిపించి యూనిట్‌ను జాగ్రత్తగా తెరిచారు. ముందుగా.. రెండు పాములను గుర్తించి సురక్షితంగా బయటకు తీశారు. ఆ తర్వాత యూనిట్ రెండో వైపున మరో రెండు పాములు కనిపించాయి. వాటిని కూడా స్నేక్ క్యాచర్లు చాకచక్యంగా పట్టుకున్నారు. అయితే.. మరో పాము కోసం గాలిస్తుండగా.. అది ఏసీ పైపు ద్వారా బయటకు తప్పించుకుంది. పట్టుకున్న నాలుగు పాముల్లో ఒకటి మీటర్ పొడవు ఉండగా.. మిగిలినవి కాస్త చిన్నవిగా ఉన్నట్లు మాధవ్ తెలిపారు. తన ఇంటికి అతి సమీపంలో చెట్ల కొమ్మలు ఉండటం వల్ల పాములు సులభంగా ఇంటిపైకి చేరుకుని ఉండొచ్చునని మాధవ్ తెలిపారు. అక్కడి నుంచి ఏసీ అవుట్‌డోర్ పైపుల ద్వారా లోపలికి ప్రవేశించి ఉంటాయని భావిస్తున్నారు. కాగా, ఇంటి గోడలకు, డాబాకు తాకుతూ ఉండే చెట్ల కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏసీ పైపులు లోపలికి వెళ్లే రంధ్రాల వద్ద ఖాళీ లేకుండా సీల్ చేయాలని.. ఎప్పుడైనా వింత శబ్దాలు వస్తే నిర్లక్ష్యం చేయకుండా తనిఖీ చేయాలని అంటున్నారు.